పెరిగినవి ఉద్యోగాలు కాదు, స్వయం ఉపాధి

గత ఏడాది కొత్తగా నాలుగు కోట్ల 67 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించిన వివరాలపై ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు. అవి ఉద్యోగాలు కాదని, కేవలం ఉపాధి అవకాశాలు మాత్రమేనని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

పెరిగినవి ఉద్యోగాలు కాదు, స్వయం ఉపాధి

జూన్‌ 10- గత ఏడాది కొత్తగా నాలుగు కోట్ల 67 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించిన వివరాలపై ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు. అవి ఉద్యోగాలు కాదని, కేవలం ఉపాధి అవకాశాలు మాత్రమేనని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. స్వయం ఉపాధి, తాత్కాలిక వేతన కార్మికులు, వ్యవసాయ కార్మికులు బాగా పెరిగారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వేతనం లేని ఇంటిపనితో పాటు వ్యవసాయం, స్వయం ఉపాధి రంగాలలో పనిచేస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిందన్నది వాస్తవం అని అజిం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం సస్టెయినెబుల్‌ ఎంప్లాయిమెంట్‌ సెంటర్‌ అధిపతి అమిత్‌ బసోలె చెప్పారు. ఉపాధి అవకాశాల పెరుగుదలను నిలకడైన సాధారణ వేతన ఉద్యోగాలుగా పరిగణించడానికి వీలు లేదని ఆయన తెలిపారు. ‘వాటిని ఉద్యోగాలు అనడానికి వీలు లేదు. వాణిజ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయం, స్వయం ఉపాధి, ఇంటిపని వంటి రంగాలలో ఉపాధి వెతుక్కుంటున్నార’ని ఆయన అన్నారు. పెద్ద సంఖ్యలో ఉపాధి పెరిగిన విషయం వాస్తవమని మాజీ ప్రధాన గణాంకాధికారి ప్రణబ్‌ సేన్‌ అన్నారు. వ్యవసాయం, దినసరి వేతన రంగాల్లో ఎక్కువమంది ఉపాధి పొందారన్నది కూడా వాస్తవమేనని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో ఉపాధి పెరగడం తిరోగమన సూచిక అని ఆయన అన్నారు. దేశంలో ఉపాధి పొందుతున్న వారిలో 20.9 శాతం మంది మాత్రమే వేతనాలతో కూడిన ఉద్యోగాలు చేస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కొనుగోలు శక్తి తగ్గిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉపాధి పెరిగితే కొనుగోలు శక్తి, వినిమయ శక్తి పెరగాలని వారు చెబుతున్నారు. నిరుద్యోగ సమస్యకు ముసుగు వేసేందుకే ప్రభుత్వం ఉపాధి గణాంకాలు విడుదల చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు.