పెళ్లి మండపం నుంచి పోలింగ్ కేంద్రానికి..నూతన వధూవరుల ఓటింగ్ వైరల్

తమిళనాడు ఎన్నికల్లో పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన నూతన వధూవరులు ఓటు వేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

పెళ్లి మండపం నుంచి పోలింగ్ కేంద్రానికి..నూతన వధూవరుల ఓటింగ్ వైరల్

విధాత : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో రాజకీయ నాయకులు, సినీతారలు తమ ఓటు హక్కు వినియోగంతో సందడి చేశారు.అయితే అంతకంటే ప్రత్యేక ఆకర్షణగా ఓ కొత్త పెళ్లిజంట ఓటు హక్కు వినియోగించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి మండపం నుంచి నేరుగా పెళ్లి దుస్తులలోనే నూతన వధూవరులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అందరిని ఆకట్టుకుంది.

తమిళనాడు ‘టిన్సెల్ టౌన్’గా ప్రసిద్ధి చెందిన చెన్నైలోని కోడంబాక్కం పోలింగ్ కేంద్రం వద్ద నూతన వధూవరులు ఓటర్ల క్యూలైన్ లో పెళ్లి దుస్తులు, మెడలో దండలతో కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి చేసుకున్న వెంటనే పెళ్లి మండపం నుంచి నేరుగా ఓటు వేసేందుకు వారు పోలింగ్ కేంద్రానికి వచ్చారు.పెళ్లి దుస్తులైన పట్టు పంచె (ధోతీ), పట్టు చీరలను ధరించి, మెడలో పూలమాలలతో కళకళలాడుతున్న నూతన వధూవరుల జంటను ఓటర్లు ఆసక్తిగా చూస్తూ..ఓటుహక్కు వినియోగంపై వారి నిబద్ధతను అభినందించారు.

న్యాయవాదిగా పనిచేస్తున్న వరుడు సునీల్ మాట్లాడుతూ తాళి కట్టిన కేవలం 15 నిమిషాలకే తాము హడావిడిగా పోలింగ్ కేంద్రానికి వచ్చామని తెలిపారు. మేము కాలంతో పోటీ పడుతూ హడావిడిగా వచ్చాం అని..ఎందుకంటే నా భార్య ఓటు కళ్ళకురిచి జిల్లాలో ఉంది. ఇక్కడ ఓటు వేసిన తర్వాత, మేము అక్కడికి వెళ్లాల్సి ఉంది,” అని సునీల్ మీడియాకు వెల్లడించారు. ఎన్నికల తేదీలు అధికారికంగా ప్రకటించబడక ముందే తమ పెళ్లి తేదీ ఖరారైందని ఆయన తెలిపారు. అయితే పోలింగ్ తేదీలు, పెళ్లి తేదీ ఒకే సమయంలో వచ్చినా సరే, నేను నా ఓటు వేయాలనుకున్నానని, అలాగే నా భార్య కూడా ఓటు వేయాలని కోరుకుందని తెలిపారు. అందుకే పెళ్లి తంతు ముగిసిన వెంటనే మేము పోలింగ్ కేంద్రానికి వచ్చి పౌరులుగా మా కర్తవ్యాన్ని నిర్వర్తించాం అని సునీల్ పేర్కొన్నారు.

ఓటు వేయడం అనేది కేవలం ఒక విధి మాత్రమే కాదని, తప్పక నిర్వర్తించాల్సిన ఒక బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు. ఇలాగే హైదరాబాద్ నగరం వంటి పట్టణాల్లో ఉండే ఓటర్లు కూడా ఆలోచిస్తే…ఓటింగ్ శాతం పెరిగి ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు సార్థకత చేకూరుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఏనుగు..వీడియో వైరల్
ఎంతకు తెగించార్రా..అంబులెన్స్ ను ఓయో రూమ్ చేశారు!