Supreme Court | హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించిన కాలేజీ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే

కళాశాల ప్రాంగణంలో హిజాబ్‌, నిఖాబ్‌, బుర్ఖా, టోపీలు తదితరాలను ధరించడంపై నిషేధం విధిస్తూ ముంబైలోని ఒక కళాశాల జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు ( Supreme Court) శుక్రవారం స్టే విధించింది.

Supreme Court | హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించిన కాలేజీ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే

న్యూఢిల్లీ : కళాశాల ప్రాంగణంలో హిజాబ్‌, నిఖాబ్‌, బుర్ఖా, టోపీలు తదితరాలను ధరించడంపై నిషేధం విధిస్తూ ముంబైలోని ఒక కళాశాల జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు (The Supreme Court) శుక్రవారం స్టే విధించింది. అయితే తరగతి గదిలో బాలికలు బుర్ఖా (burqa) ధరించడం లేదా క్యాపస్‌లో మతపరమైన కార్యకలాపాలు నిర్వహించడాన్ని అనుమతించేది లేదని పేర్కొన్నది. యూనిఫాం డ్రస్‌ కోడ్‌ ఉండాలని భావించినట్టయితే.. ఎంపిక చేసిన మతపరమైన చిహ్నాలపై కాలేజీ ఎందుకు నిషేధం విధించిందని, తిలకం, బొట్టు తదితర ఇతర మతపరమైన చిహ్నాలకు ఈ నిషేధం ఎందుకు పొడిగించలేదని జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ ధర్మాసనం ప్రశ్నించింది. ‘బాలికలు ఏం ధరించాలనే విషయంలో వారికి స్వేచ్ఛ ఉండాలి. కాలేజీ వారిని బలవంతంగా చేయరాదు. దేశంలో చాలా మతాలు ఉన్నాయని ఇప్పుడు మీకు అకస్మాత్తుగా మెలకువ వచ్చి గుర్తించడం దురదృష్టకరం’ అని కాలేజీ యాజమాన్యాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తిలకం పెట్టుకుని వచ్చేవారిని అనుమతించబోమని చెప్పగలరా?

తిలకం పెట్టుకుని వచ్చేవారిని అనుమతించబోమని మీరు చెప్పగలరా? మీ సూచనల్లో ఇది లేదా? అని జస్టిస్‌ కుమార్‌ ప్రశ్నించారు. నిషేధం విధిస్తూ కాలేజీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు గత జూన్‌లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో సుప్రీంకోర్టు వాదనలు వింటున్నది. ఈ సైన్స్‌ కాలేజీకి చెందిన రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థినులు 9 మంది కాలేజీ ఆదేశాలను సవాలు చేశారు. కాలేజీ ఆదేశాలు మత స్వేచ్ఛ హక్కు, గోప్యత హక్కు, ఎంపిక చేసుకునే హక్కు వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

ఇదీ వివాదం..

ఈ వివాదం 2024 మే 1న మొదలైంది. చెంబూర్‌ త్రోంబే ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ సొసైటీకి చెందిన ఎన్‌జీ ఆచార్య అండ్‌ డీకే మరాఠీ కాలేజ్‌.. తన అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌లో ఒక సర్క్యులర్‌ను ఉంచింది. ఈ గ్రూపులో కాలేజీ సిబ్బంది, విద్యార్థులు ఉంటారు. అందులో హిజాబ్‌, నిఖాబ్‌, బుర్ఖా, తల టోపీ, బ్యాడ్జీలు, స్టోల్స్‌ వంటివి కాలేజీ ప్రాంగణంలో ధరించరాదని పేర్కొన్నది. ఎలాంటి చట్టపరమైన అధికారాలు లేకుండానే కాలేజీ యాజమాన్యం ఈ సర్క్యులర్‌ను జారీ చేసిందని పిటిషనర్లు వాదించారు. ఈ సర్క్యులర్‌కు ఎలాంటి విలువ లేదని పేర్కొన్నారు.
విద్యార్థులు తొలుత కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించారు. హిజాబ్‌, నిఖాబ్‌, బుర్ఖా వంటివి ధరించడం తమ ఇష్టం, గౌరవం, గోప్యతకు సంబంధించినవని, ఆ నిబంధనలు తొలగించాలని కోరారు. ప్రిన్సిపల్‌ నిరాకరించడంతో ముంబై యూనివర్సిటీ చాన్స్‌లర్‌, వైస్‌ చాన్స్‌లర్‌ వద్దకు, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌కు ఈ విషయం తీసుకెళ్లారు. విద్యా వ్యవస్థలో ఎలాంటి వివక్ష ఉండరాదని వాటికి తెలిపారు. అయినా స్పందన లేకపోవడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కాలేజీ మేనేజ్‌మెంట్‌ తన సర్క్యులర్‌ను సమర్థించుకున్నది. యూనిఫాం డ్రస్‌ కోడ్‌ కోసం, క్రమశిక్షణ కోసమే ఈ సర్క్యులర్‌ జారీ చేసినట్టు తెలిపింది. ముస్లిం విద్యార్థినుల పట్ల వివక్ష చూపాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నది.

 

Read more :

బాలుడి మర్మంగాన్ని కొరికేసిన వీధి కుక్క.. కోకాపేట సబితానగర్‌లో దారుణం

Vinod Kambli|మాజీ క్రికెట‌ర్ కాంబ్లి ప‌రిస్థితి ఇలా మారిందేంటి.. ఫ్రెండ్‌కి సాయం చేయ‌మ‌ని స‌చిన్‌ని కోరుతున్న నెటిజ‌న్స్