మోదీకి ‘అసెంబ్లీ’ సవాల్
లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న మోదీ నేతృత్వంలోని బీజేపీ రానున్న రోజుల్లో జరుగబోయే మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నది.

మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌తోపాటు జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్‌లో ఎన్నికలు
ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ
మధ్యతరగతి వ్యతిరేక బడ్జెట్‌తో కొత్త చిక్కులు
ఐటీలో లేని చెప్పుకోతగ్గ మినహాయింపులు
ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్లపై పన్నుల పెంపు
రియల్ ఎస్టేట్ ట్యాక్స్ బెనిఫిట్లూ తొలగింపు
తీవ్ర ఆగ్రహంతో మధ్యతరగతి వర్గం ప్రజలు
దేశ జనాభాలో 30శాతంపైగా మధ్యతరగతే
ఫలితాలను మార్చివేసే శక్తి ఉన్న కీలక సెక్షన్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న మోదీ నేతృత్వంలోని బీజేపీ రానున్న రోజుల్లో జరుగబోయే మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నది. దీనికి తోడు ఇటీవలి బడ్జెట్.. మధ్యతరగతి వర్గాలకు వెన్నుపోటుగా మారిందన్న అభిప్రాయాల నేపథ్యంలో బీజేపీ పరిస్థితి కత్తిమీద సాములా తయారైంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై మధ్యతరగతి వర్గం తీవ్ర నిరాశతో ఉన్నది. మధ్యతరగతి ప్రతి యేటా ఆదాయం పన్ను స్లాబుల్లో మార్పులపై ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే.. ఈసారి ఇందులో చెప్పుకోగతగిన మార్పులేమీ లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టే రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్లపై లాభాలపై పన్నులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. రియల్ ఎస్టేట్ ట్యాక్స్ బెనిఫిట్లలో కొన్నింటిని తొలగించింది. ఇది దేశంలోని 142 కోట్ల మందిలో 30శాతంగా ఉన్న మధ్యతరగతి వర్గం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ భాగస్వామిగా ఉన్న మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని మార్చివేయాలని అనుకుంటున్నానని గ్రాఫిక్ ఆర్టిస్ట్ నామ్‌దేవ్ కట్కర్ అనే వ్యక్తి అభిప్రాయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో ప్రస్తావించింది. ఆయన స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. ‘నేను సంపాదించుకునే ఆదాయానికి అధికంగా పన్నులు చెల్లించాల్సి వస్తున్నది. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పోగొట్టుకోవడమే ఇది’ అని ఆయన అన్నారు. ‘ఈసారి ఎవరికి ఓటేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ.. బీజేపీకి మాత్రం ఓటేయను’ అని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కలిగే నష్టాలు ప్రధానిగా మోదీ హోదాను ప్రభావితం చేయకపోవచ్చు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సాధించలేకపోయిన మోదీ నాయకత్వ పటిమ, చరిష్మాపై కొత్త సందేహాలను లేవనెత్తే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయాలు మోదీ నాయకత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఢిల్లీకి చెందిన రాజకీయ వ్యాఖ్యాత ఆరతి జెరత్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీకి మెజార్టీ రాకపోవడంతో ఆ పార్టీలో వ్యాకులత ఉన్నదని అన్నారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు ఎగువ సభలో బలాబలాలను ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే బీజేపీకి ఎగువ సభలో తగినంత మెజార్టీ లేదు. ఎన్డీయే, ఇండిపెండెంట్లు, ఇతర సభ్యులపైనే బీజేపీ ఆధారపడుతున్న పరిస్థితి ప్రస్తుతానికి ఉన్నది.
ఫలితాన్ని మార్చివేయగల మధ్యతరగతి
మధ్యతరగతి వర్గంగా చెప్పేవారు సాధారణంగా ఏ పార్టీకీ అనుబంధంగా ఉండరు. అయితే.. వ్యాపారుల అనుకూల పార్టీగా భావించి.. బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే.. ఇటీవలి బడ్జెట్లో ఆదాయం పన్ను వ్యవస్థల్లో పెద్దగా మార్పు లేకపోగా..పెంచడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. పన్ను పేరుతో తమ జేబులు కత్తిస్తున్నారని జార్ఖండ్‌లో పబ్లిక్ రిలేషన్స్ సంస్థను నిర్వహిస్తున్న కుముద్ రంజన్ అనే వ్యక్తి చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని ఆయన అంటున్నారు. బడ్జెట్ అనంతరం సీవోటర్ ఒక సర్వే నిర్వహించింది. మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన నిరాశాజనకమైన బడ్జెట్ ఇదేనని సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో నలుగురు చెప్పారు. ఈ సర్వేలో మొత్తం 2000 మంది అభిప్రాయాలు సేకరించినట్టు సీవోటర్ పేర్కొన్నది. భారతదేశంలో స్వింగ్ అయ్యే ఓటుకు మధ్యతరగతి ప్రజలే కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక అంశాలతోపాటు.. గ్రామీణ ప్రాంతాల్లో దుస్థితి, భారీ స్థాయిలో ఉన్న నిరుద్యోగిత విషయంలో ఉన్న ఆగ్రహం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలను గణనీయంగా దెబ్బతీయొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌తోపాటు.. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీలకు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఎన్నికలు మొదలుకానున్నాయి. మధ్యతరగతివర్గంలో ఆగ్రహం అర్థం చేసుకోతగినదేనని మస్సాచూసెట్స్ యూనివర్సిటీలో బోధించే ఆర్థిక వేత్త జయతిఘోష్ అన్నారు. రాజకీయ వృత్తాంతాలను అది ప్రభావితం చేయగలదని వ్యాఖ్యానించారు. వీరంతా ఇప్పటికే సాధారణ మీడియాలో, ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల్లో గళాన్ని వినిపిస్తున్నారని, ఫలితాలను వారు మార్చివేయగలరని అన్నారు.
అందిపుచ్చుకుంటున్న ప్రతిపక్షం
దేశంలో మధ్యతరగతి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీలు అందిపుచ్చుకుంటున్నాయి. లోక్‌సభలో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మధ్యతరగతి అంశాన్ని ప్రస్తావించారు. ‘ఈ బడ్జెట్‌కు ముందు వరకూ మధ్యతరగతి ప్రజలు బహుశా ప్రధాన మంత్రికి మద్దతుగా ఉన్నారేమో. కానీ.. ఈ బడ్జెట్‌తో మీరు వారికి వెన్నుపోటు పొడిచారు. ఇది విచారకరమైదే అయినా.. దీనిలో ఒక నిగూఢ లాభం కూడా ఉన్నది. ఇప్పుడు మధ్య తరగతి వర్గం ప్రజలు మిమ్మల్ని వదిలేసి.. మా పక్షాన చేరుతున్నారు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గం బాధను తాను అర్థం చేసుకోగలనని, కానీ.. ఇంతకు మించి తాను ఏమీ చేయలేనని చేతులెత్తేశారు. ‘నేను కూడా మధ్యతరగతి వర్గం నుంచే వచ్చాను. వారి సమస్యలను అర్థం చేసుకోగలను. మధ్యతరగతి వారికి కొంత ఉపశమనం కలిగించాలని అనుకున్నానని, కానీ.. తనకు కొన్ని పరిమితులు ఉన్నాయి’ అని నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ అధికార ప్రతినిధి గురు ప్రకాశ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. కొన్ని ఉద్దేశాలు కల్పించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అందుకు వారికి పూర్తి హక్కు ఉన్నదని వ్యాఖ్యానించారు. ‘మా ప్రభుత్వం లేదా మా పార్టీ రాబోయే ఎన్నికల కోసం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకోలేదు. అది మధ్యతరగతి వర్గం కావచ్చు.. దిగువ మధ్యతరగతి కావచ్చు.. సమాజంలోని అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోవడమే మా ప్రాథమిక సూత్రం. వాస్వం ఏంటంటే.. మేం మా 11వ బడ్జెట్‌ను సమర్పించాం. మా విధానాలు, రాజకీయాలు నచ్చి ప్రజలు మాకు ఇంకో ఐదేళ్లు సమయం ఇచ్చారు’ అని ఆయన సమర్థించుకున్నారు. అయితే.. అధికార పార్టీకి మధ్య తరగతి ఆగ్రహం అనేది ఒక కీలకమైన అంశమే అవుతుందని రాజకీయ విశ్లేషకుడు, గతంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేసిన అమితాబ్ తివారి చెప్పారు. ‘బీజేపీ ఇప్పటికే మూల్యం చెల్లించుకున్నది. మధ్యతరగతి, ధనికుల వల్లే బీజేపీ మెజార్టీకి దూరంగా ఉండిపోయింది. ఇది ఇంకా దారుణంగా తయారయ్యే అవకాశం ఉన్నది. వేగంతా పతనమయ్యేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.