అమెరికా నుంచి భారత్‌కు 657 ప్రాచీన వస్తువుల అప్పగింత

అమెరికా నుంచి రూ.117 కోట్ల విలువైన 657 ప్రాచీన కళాఖండాలను భారత్‌కు అప్పగించారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలపై కీలక విజయం సాధించింది.

అమెరికా నుంచి భారత్‌కు 657 ప్రాచీన వస్తువుల అప్పగింత

అంతర్జాతీయ స్మంగ్లింగ్ ముఠాల ద్వారా అక్రమ రవాణాతో విదేశాలకు తరలిపోయిన పురాతన కళాఖండాలను వెనక్కి తేవడంలో భారత్ ప్రభుత్వం కీలక విజయం సాధించింది. సుమారు రూ.117 కోట్ల విలువైన పురాతన కళాఖండాలను, వస్తువులను అమెరికా ప్రభుత్వం భారత్ కు అప్పగించింది. న్యూయార్క్‌లోని మాన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయం ఈ చారిత్రక సంపదను భారత కాన్సులేట్ ప్రతినిధి రాజలక్ష్మి కదమ్‌కు అధికారికంగా అప్పగించింది. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన విలువైన వస్తువుల పునరాగమనంతో భారత్ కు విలువైన పురాతన సంపద తిరిగి వచ్చినట్లయ్యింది. తిరిగి వచ్చిన వస్తువులలో కొన్ని అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన శిల్పాలు ఉన్నాయి.

స్మగ్లింగ్ ముఠాలపై నిఘాతోనే విజయం

మన్‌హట్టన్ జిల్లా అటార్నీ ఆల్విన్ ఎల్ బ్రాగ్ జూనియర్ మాట్లాడుతూ..అంతర్జాతీయ స్మగ్లర్ సుభాష్ కపూర్, నాన్సీ వీనర్లకు సంబంధించిన నెట్‌వర్క్‌లపై జరిపిన సుదీర్ఘ దర్యాప్తులో ఈ వస్తువులు వెలుగుచూశాయని వెల్లడించారు. 2012 నుండి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (HSI), పురావస్తు అక్రమ రవాణా నిరోధక విభాగం (ATU) సంయుక్తంగా ఈ ముఠాలను వెంబడిస్తున్నాయని తెలిపారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ల పరిధి చాలా పెద్దదని తెలిపారు. భారత్ నుంచి చోరీ కాబడి విదేశాలకు తరలిపోయిన ప్రాచీన విగ్రహాలను తిరిగి సాధించడంలో మరింత కృషి అవసరం అన్నారు.

భారత్‌కు చేరిన ప్రాచీన కళాఖండాల వివరాలు..

అవలోకితేశ్వరుని కంచు విగ్రహం: దీని విలువ సుమారు 2 మిలియన్ల డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 16 కోట్లు)గా తెలుస్తోంది. 1982లో రాయ్‌పూర్‌లోని మ్యూజియం నుండి దొంగిలించిన ఈ విగ్రహాన్ని, 2025లో న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్ సేకరణ నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రెడ్ ఐరన్‌స్టోన్ బుద్ధ విగ్రహం: ఈ విగ్రహం విలువ 7.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 63 కోట్లు). ఇది సుభాష్ కపూర్ నెట్‌వర్క్ ద్వారా అక్రమంగా అమెరికాకు చేరింది.

నాట్య గణేశుడి విగ్రహం: 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని ఒక ఆలయం నుండి దొంగిలించిన ఈ శిల్పాన్ని, నకిలీ పత్రాలతో 2012లో క్రిస్టీస్ వేలంలో విక్రయించారు. విచారణలో అసలు విషయం తెలియడంతో ఒక ప్రైవేట్ కలెక్టర్ దీనిని స్వచ్ఛందంగా అప్పగించారు.

ఇవి కూడా చదవండి :

ఏడేళ్ల బాలుడి సాహసం..పాల్క్ జలసంధి ఈదడంలో కొత్త రికార్డు
ఆర్థిక శాఖలో 14 మందికి షోకాజ్ నోటీసులు? ఆమ్యామ్యాలు పెద్దవాళ్లకు, నోటీసులు అధికారులకా..