Ustad Zakir Hussain । తబలా ఇంద్రజాలికుడు జాకీర్ హుస్సేన్ ఇక లేరు.. పుట్టిన వెంటనే విన్న మంత్రమేంటో తెలుసా?
సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలకు చెవిలో ఎవరి మతాచారం ప్రకారం మంత్రాలు లేదా వ్యాక్యాలు చదువుతారు! కానీ.. అల్లా రఖా ఖాన్ మాత్రం.. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన హుసేన్ చెవిలో తబలా ప్రాథమిక తాళాలను చదివారట!

Ustad Zakir Hussain । ఆయన వేళ్లు అద్భుతాలు చేస్తాయి! ఆయన చేతుల నుంచి మెరుపువేగంతో ‘స్యాహీ’, ‘కీనార్’, వాటి మధ్యలోని ‘సుర్’పై జనించే మధుర మిళిత ధ్వనుల సొబగులు వీనులకు విందులు చేస్తాయి! వాటికి అనుగుణంగా నాట్యమాడే ఆయన కనులు చూపరులను కట్టిపడేస్తాయి! వాతావరణం మంత్రముగ్ధమైపోతుంది! చినుకులా మొదలై.. వానై.. వరదై.. ఉప్పొంగే జలపాతమై.. ఒక్క ఉదుటన దుంకి.. ప్రశాంతమైన సెలయేరులా మనసును సంగీత ప్రపంచంలో ఓలలాడిస్తుంది! కానీ.. ఇప్పుడు ఆ ధ్వనులు ప్రత్యక్షంగా వినే అదృష్టం లేదు! తబలా అంటే ఆయన… ఆయనంటేనే తబలా! దశాబ్దాలపాటు భారతీయ సంస్కృతికి అతిపెద్ద రాయబారిగా విశ్వ యవనికపై భాసిల్లిన జాకీర్ హుస్సేన్ ఇక లేరు! ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్‌తో బాధపడుతూ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు! సంగీత ప్రపంచంలో తన కంటూ ఒక హద్దుల్లేని సామ్రాజ్యాన్ని ఏలిన ‘ఘరానా’ ‘ఉస్తాద్’ సెలవంటూ వెళ్లిపోయాడు! ఆయన వయసు 73 సంవత్సరాలు. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఆదివారంనాడు తుదిశ్వాస విడిచారు. భారత కళా‘నిధి’కి తీర్చలేని నష్టం మిగిల్చారు.
1951 మార్చి 9న ముంబైలో లెజండరీ తబలా విద్వాంసుడు అల్లా రఖా ఖాన్ దంపతులకు జన్మించిన హుస్సేన్.. తండ్రిని మించిన తనయుడిగా తన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చాటారు. ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన రెండు రోజులకే సంగీత సామ్రాజ్యంలోనూ అడుగు పెట్టిన వర పుత్రుడు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలకు చెవిలో ఎవరి మతాచారం ప్రకారం మంత్రాలు లేదా వ్యాక్యాలు చదువుతారు! కానీ.. అల్లా రఖా ఖాన్ మాత్రం.. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన హుసేన్ చెవిలో తబలా ప్రాథమిక తాళాలను చదివారట! ఈ విషయాన్ని పలు సందర్భాల్లో జాకీర్ హుస్సేన్ గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న నన్ను చేతుల్లోకి తీసుకుని ప్రార్థన పఠించడానికి బదులు.. నా చెవిలో రిథం పాడారట. ఎందుకలా చేశారంటూ మా అమ్మ బాధపడితే.. ‘ఎందుకంటే ఇదే నా ప్రార్థన’ అని చెప్పారట’ అని హుసేన్ ఒక సందర్భంలో జాకీర్ హుస్సేన్ తెలిపారు.
ఇంటిలో నిత్యం మోగుతుండే తబలా మధ్య పెరిగిన జాకీర్ హుస్సేన్.. తను సైతం ప్రతిరోజూ ఉదయం తబలా మోగించడం ప్రాక్టీస్ చేసేవారట. అలా.. తన 12వ ఏట వేరువేరు ప్రదేశాలకు వెళ్లి ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరుకున్నారు. అప్పటికే భారతీయ సంగీతం పశ్చిమ దేశాల్లో ప్రాముఖ్యం సంపాదించుకుంటున్న సమయం.. ఆయనను పశ్చిమ దేశాల్లో ప్రదర్శనలకు ఇచ్చేందుకు తీసుకువెళ్లింది. పశ్చిమదేశాల రాక్ మ్యూజిక్కు ఆకర్షితుడైన హుస్సేన్.. రాక్ స్టార్ కావాలనుకున్నారు. ఇదే ఆకాంక్షను ఆయన ఒక రాక్‌స్టార్ ముందు ఉంచారు. ఆయన ఎవరో కాదు.. ప్రఖ్యాత బీటిల్స్ గ్రూప్‌లో భాగస్వామి అయిన జార్జ్ హారిసన్! ప్రపంచ సంగీతాలను గాఢంగా పరిశీలించిన హారిసన్.. హుసేన్ నిష్ణాతుడైన కళకు ఉన్న ప్రత్యేకతను, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్కృతిని గుర్తు చేసి.. జాకీర్ హుస్సేన్‌ను వారించాడు. అప్పటి నుంచి హుసేన్ వెంటే తబలా నిలిచింది. అనేక అంతర్జాతీయ ప్రదర్శనలతో బిజీ అయిపోయారు. 1960లలోనే తన మకాంను శాన్ ఫ్రాన్సిస్కోకు మార్చిన హుసేన్.. వయొలిన్ కళాకారుడు యేహుది మెనూహిన్, జాజ్ గిటారిస్ట్ అయిన జాన్ మెక్ లాఫ్లిన్ వంటి ఉద్దండులతో కలిసి పనిచేశారు. 1976లో శక్తి పేరిట ఆయన విడుదల చేసిన ఆల్బం జుగల్బందీ సంగీత ప్రపంచంలో విప్లవాన్ని రేపింది. ఈ ఆల్బం కోసం హుస్సేన్ మెక్ లాఫ్లిన్, వయోలిన్ విద్వాంసుడు ఎల్ శంకర్, ఘటం వాయిద్యకారుడు టీహెచ్ విక్కు వినాయకరమ్ భాగస్వామ్యాన్ని తీసుకున్నాడు. 50 ఏళ్ల తర్వాత న్యూ శక్తి ఆల్బం పేరిట దానికి పునఃప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ ఆల్బం ద్వారా బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బం అవార్డును గెలుపొందాడు. మెక్ లాఫ్లిన్తోపాటు శంకర్ మహదేవన్, వీ సెల్వగణేశ్, గణేశ్ రాజగోపాలన్ ఈ ఆల్బంకు హుస్సేన్‌తోపాటు పనిచేశారు. హిందూస్థానీ సంగీతాన్ని పాశ్చ్యాత్య సంగీతంతో సమ్మిళతం చేయడం ద్వారా జుగల్బందీతో మ్యాజిక్ చేశాడు. ఆయన ప్రయోగాలకు అనేక ప్రశంసలు లభించాయి. ఆయనతోనే ఇండో ఫ్యూజన్ అనే వేదిక స్థిరపడింది. ఐరిష్ గాయకుడు వాన్ మోరిసన్, ఆయన గ్రూపు ‘ఎర్త్ విండ్ అండ్ ఫైర్’, మిక్కీ హార్ట్ వంటి వారితో కలిసి జాకీర్ హుస్సేన్ ఆల్బంలు రూపొందించారు. ఫ్లూట్ విద్వాంసుడు చౌరాసియా, నార్వేకు చెందిన శాక్సోఫోనిస్ట్ జాన్ గర్బరెక్, వినాయకరమ్, శిక్రు అదెపోజు, నైజీరియాకు చెందిన బబటుండే ఒలాటున్జి, పోర్టోరికోకు చెందిన గియోవన్నీ హిడాల్గో, ఫ్రాంక్ కోలోన్, బ్రెజిల్‌కు చెందిన పెర్యూషనిస్టు ఐర్టో మోరియర తదితర అనేక మంది ప్రముఖులతో ఆల్బంలు తయారు చేశారు.
భారతీయ సంగీత విద్వాంసులైన పండిట్ రవిశంకర్, సరోద్ విద్వాంసులైన ఉస్తాద్ అలి అక్బర్ ఖాన్, ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్, సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ, ఫ్టూటిస్ట్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వంటి వారితో కలిసి గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో అనేక అద్భుతమైన ఆల్బంలు రూపొందించారు. ఆయనకు 1988లో పద్మ శ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. ఆయనకు భార్య ఆంటోనియా మిన్నెకోలా, కుమార్తెలు అనిసీ ఖురేషీ, ఇసాబెల్లా ఖురేషీ ఉన్నారు. ఆయన చేసిన ఆల్బంలు ఎన్నున్నా.. ఆయన భారతీయులకు తాజ్ మహల్ టీ కోసం చేసిన వాణిజ్య ప్రకటన గొప్ప హిట్ అయింది. అప్పటినుంచి ప్రతి భారతీయుడి నోటి వెంట్ వాహ్ తాజ్ అనే పదం వినిపించడం పరిపాటి అయ్యింది.