ఆరు లేన్లు.. 343 కిలోమీటర్లు దూరం
హిందూపురం, కొప్పర్తి కి రవాణా ఈజీ
17 ఇంటర్ ఛేంజెస్… కడపలోనే ఏడు
అడ్వాన్సుడు ట్రాఫిక్ మేనేజిమెంట్ సిస్టం
రెండు రాష్ట్రాల రాజధాని నగరాలను కలుపుతూ కొత్తగా గ్రీన్ ఫీల్డు హైవే వస్తున్నది. 544-జీ గా పిలుస్తున్న ఎకనామిక్ కారిడార్ పనులు ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తి కాగా ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది త్రైమాసికంలో మొత్తం పనులు పూర్తి అయ్యి హైవే అందుబాటులోకి రానున్నది. హైవే ను 14 ప్యాకేజీలుగా విభజించి పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించగా, మట్టి తవ్వే పనులు, నిర్మాణాలు, బ్రిడ్జీలు, టన్నెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.19,320 కోట్ల అంచనా వ్యయంతో భారతమాల పరియోజన ఫేజ్-2 కింద అనుమతులు వచ్చాయి. బెంగళూరు – కడప – విజయవాడ ఎకనామిక్ కారిడార్ గా మారనున్నదని, పారిశ్రామిక పురోగతికి దోహదం చేయనున్నది. దక్షిణ భారత దేశంలోనే ప్రధాన హైవే గా రూపుదిద్దుకోనున్నది. కోడూరు గ్రామంలోని కోడికొండ చెక్ పోస్టు వద్ద ప్రారంభమై ఏపీలోని శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల మీదుగా అద్దంకి వద్ద కలుస్తుంది. బెంగళూరు-హైదరాబాద్, చెన్నై-విజయవాడ హైవేలను కలుపుతూ ఈ ఆరులేన్ల హైవేను నిర్మాణం చేస్తున్నారు. ఈ రోడ్డుతో రాయలసీమ, ఆంధ్ర లోని పలు ప్రాంతాలకు ప్రమాదాలు లేని కనెక్టివిటీ పెరగడంతో పాటు పారిశ్రామిక, మౌలిక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
నేషనల్ హైవే ఎన్.హెచ్-544జీ ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ) డెవలప్ మెంట్ చేస్తున్నది. మొత్తం 343.24 కిలోమీటర్ల పొడవునా నిర్మాణం చేసే గ్రీన్ ఫీల్డు హైవే లో 190 కిలోమీటర్ల బ్రౌన్ ఫీల్డు కూడా ప్రతిపాదించారు. బెంగళూరు నుంచి కోడికొండ చెక్ పోస్టు వరకు ఉన్న 90 కిలోమీటర్లు, అద్దంకి నుంచి విజయవాడ వరకు ఉన్న 100 కిలోమీటర్లు బ్రౌన్ ఫీల్డుగా ప్రతిపాదించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కర్నాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా సౌకర్యం మెరుగు పడడంతో పాటు సరకులు, వస్తువుల రవాణాకు అనువుగా మారనున్నది. రెండు నగరాల మధ్య దూరం కూడా 110 కిలోమీటర్ల మేర తగ్గుతున్నది. దూరం తగ్గడం మూలంగా ప్రయాణ సమయం కూడా మూడు నుంచి నాలుగు గంటలు తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా ఆరు లేదా ఏడు గంటలలో చేరుకోవచ్చు. పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసుకునేందుకు ఇబ్బందులు తప్పడమే కాకుండా గమ్యస్థానాలకు తక్కువ సమయంలో చేర్చుకోనున్నారు.
కడప జిల్లాలకు ఎక్కువగా ప్రయోజనం
ఈ హైవే నిర్మాణంతో కడప జిల్లా ఎక్కవగా ప్రయోజనాలు పొందనున్నది. కడపలోని 12 మండలాల మీదుగా హైవే నిర్మాణం పనులు శరవేగగా జరుగుతున్నాయి. పులివెందుల, వేముల, వేంపల్లి, వీ.ఎన్.పల్లి, ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు, మైదుకూరు, బ్రహ్మంగారి మఠం, బీ కోడూరు, పోరుమామిళ్ల మీదుగా 123 కిలోమీటర్ల దూరం ఆరు లేన్ల హైవే రానున్నది. ఈ ఆరు లేన్ల రోడ్డు కోసం జిల్లాలో రూ.5,377.72 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథకమికంగా అంచనాలు వేశారు. టన్నెళ్ల నిర్మాణం ఉండడంతో వ్యయం పెరిగిందని ఇంజినీర్లు అంటున్నారు. ఎక్కువగా ఈ జిల్లానే లబ్ధి పొందుతుండడంతో మొత్తం 17 ఇంటర్ ఛేంజెస్ లో ఏడు ఈ జిల్లాలోనే ఏర్పాటు చేస్తున్నారు. మిగతా పది ఇంటర్ చేంజేస్ వేరే జిల్లాలలో వస్తున్నాయి. కడప జిల్లా కేంద్రం కావడంతో ఇంటర్ ఛేంజ్ ను తప్పనిసరి చేశారు. ఫ్యూయల్ స్టేషన్లు, రెస్టారెంట్లు, టాయ్ లెట్లు, ట్రక్ పార్కింగ్, ట్రైలర్ పార్కింగ్ జోన్ల కోసం మొత్తం హైవే పొడవునా 18 ప్రాంతాలను ఎంపిక చేయగా అందులో నాలుగు కడప జిల్లాలోనే ఏర్పాటు అవుతున్నాయి.
చివరి దశకు భూ సేకరణ
హైవే నిర్మాణం కోసం భూ సేకరణ దాదాపు పూర్తయింది. మొత్తం 2,750 ఎకరాల భూమి అవసరం ఉండగా దాదాపు 80 శాతం సేకరణ పూర్తి చేశారు. ఒక్క కడప జిల్లాలోనే 1,020 ఎకరాలు సేకరించారు. రోడ్డు నిర్మాణం కోసం ఎన్.హెచ్.ఏ.ఐ 14 ప్యాకేజీలుగా విభజించగా, 2025 మార్చి నెలలోనే స్టేజి-2 అటవీ శాఖ అనుమతులు పొందింది కూడా. కొన్ని ప్యాకేజీలలో 50 శాతం, మరికొన్ని ప్యాకేజీలలో 60 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. మూడు నాలుగు ప్యాకేజీలలో 30 శాతం లోపే పనులు పూర్తి కావడం జరిగింది.
స్మార్ట్ ట్రాఫిక్ మేనేజిమెంట్
విజయవాడ నుంచి బెంగళూరు వరకు నిర్మాణం చేయనున్న గ్రీన్ ఫీల్డు హైవే మొత్తం అడ్వాన్సుడు ట్రాఫిక్ మేనేజిమెంట్ సిస్టమ్ ను అమలు చేయనున్నారు. దీని వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకపోవడమే కాకుండా నిరంతరం పర్యవేక్షించడానికి సులువుగా ఉండనున్నది. వాహనాలు ప్రయాణించిన దూరం మాత్రమే టోల్ చెల్లించే విధంగా నూతన టోల్ విధానం అమలు చేయనున్నారు.
