విధాత : దేశ రాజకీయాలలో ఆసక్తిరేపిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సురక్షితంగా, పారదర్శకంగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతల ఏర్పాట్లను పోలీసు పరిశీలకులు పర్యవేక్షిస్తారని తెలిపింది. ఈసీఐనెట్ ద్వారా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డు కలిగి ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు ఈసీ పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ లో కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు ఎన్నికల సంఘం అదనపు పరిశీలకులను మోహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకటి కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లు ఉన్న నియోజకవర్గాల్లో మొత్తం 165 మంది ఎన్నికల, 77 మంది పోలీసు పరిశీలకులను నియమించడం విశేషం.
ఎగ్జిట్ పోల్స్ తో ఫలితాలపై పెరిగిన ఆసక్తి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గతం కంటే అధికంగా పోలింగ్ శాతం నమోదవ్వడం..ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను అందించడంతో ఆ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందని అంచనా వేస్తుండటంతో ఆ రాష్ట్రాల ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్‌ల భవితవ్యవానికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.
అస్సాం..పుదుచ్చేరిలలో ఎన్డీయేదే హవా.. !
అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో ఎన్డీయే మరోసారి తిరుగులేని విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు తేల్చగా…పుదుచ్చేరిలోనూ ఎన్డీఏనే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉండగా మెజార్టీకి 64 స్థానాలు కావాలి. అధికార బీజేపీ కూటమికి 88 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం ఉందని, వరుసగా మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టే దిశగా దూసుకుపోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని అధికార ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి రావొచ్చని అన్ని సర్వేలు అభిప్రాయపడ్డాయి. మొత్తం 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో మ్యాజిక్ ఫిగర్ 16. కాంగ్రెస్, డీఎంకే కూటమి రెండో స్థానానికి పరిమితం కానున్నాయని పేర్కొన్నాయి.
కేరళంలో ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ పై సందేహాలు
కేరళంలో మాత్రం సీఎం పినరయి విజయన్ సారధ్యంలోని ఎల్డీఎఫ్ కు, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి మధ్య నువ్వానేనా అన్నట్లుగా గెలుపు ఓటములు ఉంటాయని ఎగ్జిల్ పోల్ సర్వేలు వెల్లడించాయి. కొన్ని సర్వేలైతే యూడీఎఫ్ దే పైచేయి అని చెప్పడంతో కేరళం ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. కేరళంలో సాధారణంగా ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. 2021 ఎన్నికల్లో మాత్రం ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ధఫా ఎల్డీఎఫ్‌కు హ్యాట్రిక్ అవకాశం లేదని సర్వే సంస్థలు పేర్కొనడం ఫలితాలపై ఆసక్తి పెంచేసింది. కేరళం అసెంబ్లీలో మొత్తం స్థానాలు 140 కాగా..మెజార్టీకి 71 స్థానాలు అవసరం.
అధికార సాధనలో డీఎంకే చరిత్ర సృష్టిస్తుందా..
తమిళనాడు రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని ఓటర్లు మార్చడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే ఈ ధఫా తమిళనాడులో అధికార డీఎంకే మరోసారి అధికార పీఠాన్ని అందుకోబోతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ- అన్నాడీఎంకేకు నిరాశ తప్పదని తేల్చాయి. ఇక సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకేకి రెండంకెల సీట్లు రావొచ్చని, మూడో స్థానానికి పరిమితం కావచ్చని మరికొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా సంస్థ విజయ్ పార్టీ డీఎంకేకు విజయ్ గండికొడుతుందని చెప్పడంతో ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది. తమిళనాడులో మొత్తం స్థానాలు 234కాగా..మెజార్టీకి 118స్థానాలు అవసరం.
బెంగాల్‌లో కమల వికాసం..?
ఇకపోతే దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈసారి పశ్చిమబెంగాల్‌లో కమలం వికసించబోతోందని అధికశాతం ఎగ్జిట్‌పోల్స్ జోస్యం చెప్పాయి. ఏకధాటిగా విజయం సాధిస్తున్న మమతాబెనర్జీ ఆధిపత్యానికి ఈసారి గండిపడుతుందని, బొటాబోటీ మెజార్టీతోనైనా బీజేపీ అధికారాన్ని అందుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 4 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారం సాధిస్తుందని చెబుతుంటే, 2 సంస్థలు మాత్రం టీఎంసీ వస్తుందని అంచనా వేశాయి. బెంగాల్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 294కాగా..మెజార్టీకి 148స్థానాలు కావాల్సి ఉంది. టీఎంసీ, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్న పోటీ సాగడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ 155-160 స్థానాలు సాధించి, 148 మెజారిటీ మార్కును దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.
