మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?

రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రం తిరస్కరణకు గురికావడం కాంగ్రెస్‌లో కాక రేపుతున్నది. నటరాజన్‌పై తెలంగాణలో నమోదైన కేసుల విషయాలు ఎంపీ ఎన్నికల కమిషన్‌కు ఎలా చేరాయన్న విషయంలో ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తున్నది. ఈ వ్యవహారం ఎవరికి చుట్టుకుంటుందోనన్న చర్చలు సాగుతున్నాయి.

విధాత, హైదరాబాద్:

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కారానికి కారకులు ఎవరు? సూత్రధారులు ఎవరు? కేసు ఉన్నట్లు డాక్యుమెంట్లు పంపించిన బడా నేతలు ఎవరు? అనే విషఁంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు విన్పిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలే తమకు డాక్యుమెంట్లు పంపించారని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ మీడియాకు స్పష్టం చేయగా, ఆ ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు తిరస్కరించారు. ఆమె కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు తెలంగాణ నుంచే అందాయని బీజేపీ వర్గాలు సైతం ప్రకటించాయి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో కొందరి నుంచే డాక్యుమెంట్లు అందాయని మధ్యప్రదేశ్ బీజేపీ నేత ఒకరు స్పష్టం చేయడం బీజేపీ, కాంగ్రెస్ మధ్య అగ్గి రాజేసింది. మీనాక్షిపై కేసు ఉన్నట్లు మధ్యప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌కు రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చారా? లేక తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందా? అనేది ఆ పార్టీ విచారించుకోవాల్సిన విషయం అంటూ బీజేపీ ఎంపీ డీ అరవింద్‌ మరో బాంబు పేల్చారు. ఈ వివాదం అటూ ఇటూ పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చుట్టుకున్నదని, ఆయన ఢిల్లీ పార్టీ పెద్దలకు గత రెండు రోజులుగా వివరణ ఇచ్చుకునే పనిలో ఉన్నారని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు మీనాక్షి తన నామినేషన్ పత్రాలను భోపాల్‌లోని రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వాటి పరిశీలన సందర్భంగా.. ఆమెపై తెలంగాణలో నమోదైన క్రిమినల్‌ కేసును దాచి పెట్టారనే నెపంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆశ్చర్యం, అనుమానాలు వ్యక్తం చేశాయి. పార్టీ నిర్ణయం మేరకు కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్వి, వివేక్ టంకా, రణదీప్ సింగ్ సుర్జేవాలా, జైరాం రమేష్, దీపాదాస్ మున్షీ, భూపేశ్ భఘేట్, మీనాక్షి నటరాజన్, అల్కా లంబా బుధవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కార్యాలయంలో ఆర్వో వైఖరిపై ఫిర్యాదు చేశారు. కోర్టులో అధికారికంగా అభియోగాలు నమోదు అయిన కేసుల వివరాలు మాత్రమే అభ్యర్థులు తెలియచేస్తారని ఈసీఐ కమిషనర్లకు వివరించారు. ఆర్వో నిర్ణయాన్ని తిరస్కరించే అధికారాలు ఈసీఐకి ఉన్నాయని, గతంలో హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో ఆర్వో ఆదేశాలను పక్కకు పెట్టారని గుర్తు చేశారు. దీనిపై ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అటు మీనాక్షీ నటరాజన్, ఇటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సరి లేదంటే న్యాయం కోసం సుప్రీంకోర్టును తట్టాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేస్తున్నదని పీసీసీ అధ్యక్షుడు బీ మహేష్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ అడ్వైజర్ వీ హన్మంతరావు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. ఓటు చోరీ, ఎస్ఐఆర్ తరువాత ఇప్పుడు బీజేపీ సీట్ చోరీకి పాల్పడుతుందన్నారు. తెలంగాణలో మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని రేవంత్ స్పష్టం చేశారు. ఇది ప్రజస్వామ్యంపై దాడి, ప్రజల గొంతులను అణచివేయడమేనని అన్నారు.

కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఆధారాలతో సహా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఎలా చేరాయనే దానిపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా అంతర్గతంగా విచారిస్తున్నారని సమాచారం. ఇంత స్వల్ప వ్యవధిలో ఆధారాలతో సహా చేరాల్సిన వారికి చేరడం అంటే… తెలంగాణ నుంచే బీజేపీ నేతలకు అంది ఉంటాయనే అనుమానం ఢిల్లీ పెద్దల్లో వచ్చిందంటున్నారు. దీంతో రెండు రోజులు గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ, వివరాలు, అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. పనిలో పనిగా కొందరు విధేయులు ఈ డాక్యుమెంట్లు పెద్ద నాయకుల నుంచే వెళ్లాయని, ఇందులో అనుమానించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయంటూ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి, బీజేపీ నేతలు, ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు ఇటూ పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నదని కాంగ్రెస్ సీనియర్లే చర్చించుకుంటున్నారు.

అప్పటి నుంచే విభేధాలు మొదలయ్యాయి…

మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమితులు అయిన తరువాత ఆమెకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య భేధాభిప్రాయాలు పెరిగాయని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తెలంగాణలో పాదయాత్రకు నాయకత్వం వహించే బాధ్యతను ఢిల్లీ పెద్దలు మీనాక్షికి అప్పగించిన సందర్భంలో రాష్ట్ర నాయకత్వంలోని ఒక వర్గం ఆ నిర్ణయాన్ని అంతర్గతంగా వ్యతిరేకించడమే కాకుండా అనుమానంతో చూసిందని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 2025 జూలై 31 నుంచి మీనాక్షి పాదయాత్ర చేస్తారని గాంధీ భవన్ లో పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు కూడా. అప్పట్లో ఈ ప్రకటన రాష్ట్ర కాంగ్రెస్ లో పెను ప్రకంపనలు సృష్టించింది. పాదయాత్ర కో ఆర్డినేషన్ కమిటీలో రేవంత్ వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసిందంటున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తెలుసుకోవాలనే ఢిల్లీ పెద్దల ఆలోచన. ఇదే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ఆమె నేరుగా సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ లో కూర్చుని సమీక్షించడం తెలిసిందే. ఈ అంశాలపైనే మీనాక్షీ, రేవంత్ మధ్య విభేధాలు పొడసూపి పెరిగి పెద్దవి అయ్యాయని బీజేపీ నేతలు అంటున్నారు. తమ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు కల్పించేందుకు బీజేపీ నాయకులు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని, రాజ్యసభ నామినేషన్ తిరస్కారం పై ఉద్దేశపూర్వకంగా దృష్టి మరలుస్తున్నారని ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రాంత్ బూరియా ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ బీజేపీ నేతలు లబ్ధిపొందుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

ఈ గొడవ ఇలా ఉండగానే ఝార్ఖండ్ రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నాత్వాని నామినేషన్‌ను తిరస్కరించాలని ఆర్వో కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈయనపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటిని నామినేషన్ పత్రాల్లో తెలియచేయకుండా దాచి పెట్టారని ఆర్వోకు ఫిర్యాదు చేశారు. గతంలో ఈయన ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పరిమళ్ నాత్వానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి సన్నిహితుడనే పేరుంది.

Latest News