Mega Tsunami | వెయ్యి అడుగల ఎత్తు కెరటాలతో.. అమెరికాపైకి మెగా సునామీ?

  • By: TAAZ    news    May 21, 2025 11:01 PM IST
Mega Tsunami | వెయ్యి అడుగల ఎత్తు కెరటాలతో.. అమెరికాపైకి మెగా సునామీ?

Mega Tsunami |

జపాన్‌లో తరచూ సంభవించే సునామీలు ఎంతటి భీకరస్థాయిలో ఉంటాయో ఆ సునామీ మన దేశ తీరాలను తాకినప్పుడు కానీ తెలియలేదు. ఇప్పటికీ సునామీ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడే వీడియోలు నెట్టింట కనిపిస్తూనే ఉంటాయి. అవి తాటి చెట్టంత ఎత్తున విరుచుకుపడుతాయి. కానీ.. వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న కెరటాలు గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించండి! ఊహిస్తేనే ఒళ్లు గగుర్పొడవటం ఖాయం. అయితే.. అలాంటి పెను ప్రమాదం మెగా సునామీ రూపంలో అమెరికాకు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణ భూకంపాల సమయంలో వచ్చే సునామీల కంటే.. భారీ కొండచరియలు విరిగిపడటం లేదా అగ్నిపర్వతాలు కుప్పకూలడం వంటి సమయాల్లో వచ్చే మెగా సునామీలు సృష్టించే బీభత్సం ఊహలకు అందదని అంటున్నారు.

ముప్పు ముంగిట అలాస్కా, హవాయి, వెస్ట్‌కోస్ట్‌ ప్రాంతాలు

అమెరికాలోని అలాస్కా, హవాయి, వెస్ట్‌కోస్ట్‌ ప్రాంతాలు ప్రస్తుతం ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి ఇవి అస్థిరమైన అగ్నిపర్వతాలు కలిగి ఉన్న ప్రాంతాలు కావడమే కాకుండా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడే, భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలు కావడమే ఈ మప్పునకు కారణమంటున్నారు. డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం భూమిని తాకినప్పుడు కిలోమీటరు పైనే సముద్ర కెరటాలు ఎగసిపడ్డాయి. అవి సృష్టించిన ప్రభావాలు వదిలిన ఆనవాళ్లను ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో హెచ్చరిక వస్తున్నది. లా పాల్మాలోని కెనరీ ఐలాండ్‌లో ఉన్న కుంబ్రే విజా అగ్నిపర్వతం అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలిపోవడం ద్వారా మెగా సునామీని సృష్టిస్తుందని, ఆ రక్కసి కెరటాలు అమెరికా తూర్పు తీరంపైకి పోటెత్తే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న లా పాల్మా అనే సిరీస్‌కు ఇది వాస్తవ రూపం అన్నమాట. ఈ సిరీస్‌కు ఆలోచన 2001లో డాక్టర్‌ సైమన్‌ డే , స్టీవెన్‌ వార్డ్‌ చేసిన హెచ్చరికలు. లా పాల్మాలోని కుంబ్రే విజా అగ్నిపర్వతం పశ్చిమ భాగంలోని 120 ఘనపు మైళ్ల (క్యూబిక్‌ మైల్స్‌) రాయి.. ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోతుందని, తద్వారా భారీ సునామీ కెరటాలను సృష్టించే అవకాశం ఉందని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.

అప్పుడు ఉద్భవించే కెరటాలు అగ్నిపర్వతం వద్ద రెండు వేల అడుగుల ఎత్తు వరకూ ఉండి.. అమెరికాను తాకే సమయంలో 150 అడగుల వరకూ ఉంటాయని వారి పరిశోధన తేల్చింది. అయితే కొందరు నిపుణులు మాత్రం కుంబ్రే విజా సినారియోకు అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నప్పటికీ.. ఈ అగ్నిపర్వతం ఎలాంటి సునామీ లేకుండా బద్దలైంది కాబట్టి.. అమెరికాలోని అలాస్కా, హవాయి, వెస్ట్‌ కోస్ట్‌ ప్రాంతాలు మెగా సునామీ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతాలు గతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు, అగ్నిపర్వతాలు కుప్పకూలడం, భూకంపాల వంటివాటితో సునామీలను ఎదుర్కొన్నాయి. ప్రస్తుత భూభౌతిక కార్యకలాపాలు, పర్యావరణ మార్పులు ఈ ప్రాంతాలను మరింత దుర్బలంగా మార్చివేస్తున్నాయని చెబుతున్నారు. ఇవి తీర ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఆ ప్రాంతాల్లో ఏం జరిగింది?

అలాస్కాలోని లిటుయా బే ప్రాంతంలో భూకంపంతో లక్షల టన్నుల కొండ గిల్బర్ట్‌ ఇన్‌లెట్‌లోకి వెళ్లింది. ఇది సుమారు 2400 అడుగులు, 3000 అడుగుల భారీ కొండ (సుమారు 9 కోట్ల టన్నుల బరువు) ఉంటుందని అంచనా. ఫలితంగా మెగా సునామీ వచ్చింది. మంచుగడ్డలతో కూడిన నీళ్లు అలాస్కాను ముంచాయి. హవాయిలో కూడా సుమారు లక్ష ఏళ్ల క్రితం వెయ్యి అడుగుల సునామీ కెరటం లానాయి ద్వీపాన్ని ముంచెత్తింది. ఈ సందర్భంగా కొట్టుకొచ్చిన సముద్ర జీవుల శిలాజాలను కొండలపై కనుగొన్నారు. వెస్ట్‌ కోస్ట్‌లో 1700 సంవత్సరం జనవరి 26న 9 పాయింట్ల తీవ్రతతో వచ్చిన భూకంపం సృష్టించిన సునామీ.. తీర ప్రాంతంలో ఒక్కరినీ ప్రాణాలతో విడిచిపెట్టలేదు. భూకంపం సంభవించిన 30 నిమిషాలకే 100 అడుగుల కెరటాలు విరుచుకుపడ్డాయి.