కాటేసిన పాముని కొట్టిచంపి ఆసుప‌త్రికి తీసుకెళ్లిన బాలుడు

విధాత‌:పాము కాటేసినా ఏ మాత్రం భయపడలేదు. వెంటపడి చంపేశాడు. చచ్చిన పామును చేతప‌ట్టుకొని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది త‌న‌ ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ సాహసం చేసింది ఏడేళ్ల బాలుడు కావడం విశేషం. తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టకు చెందిన రాము కుమారుడు దర్షిత్‌ (7) మూడో తరగతి చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని తన అవ్వ వద్దకు వెళ్లి పొలంలో ఆడుకుంటుండగా ఏదో కరిచినట్లు గ్రహించాడు. ఆ బాలుడు వెంటనే అక్కడ వెతకగా రక్తపింజరి […]

కాటేసిన పాముని కొట్టిచంపి ఆసుప‌త్రికి తీసుకెళ్లిన బాలుడు

విధాత‌:పాము కాటేసినా ఏ మాత్రం భయపడలేదు. వెంటపడి చంపేశాడు. చచ్చిన పామును చేతప‌ట్టుకొని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది త‌న‌ ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ సాహసం చేసింది ఏడేళ్ల బాలుడు కావడం విశేషం. తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టకు చెందిన రాము కుమారుడు దర్షిత్‌ (7) మూడో తరగతి చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని తన అవ్వ వద్దకు వెళ్లి పొలంలో ఆడుకుంటుండగా ఏదో కరిచినట్లు గ్రహించాడు.

ఆ బాలుడు వెంటనే అక్కడ వెతకగా రక్తపింజరి జాతి పాము పాకుతూ వెళుతుండగా చూశాడు. పొలంలోని మొక్కల మధ్య దానిని వెంటాడి వేటాడి రాళ్లతో కొట్టి చంపాడు. చచ్చిన పామును చేతపట్టుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో కలిసి కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. పాము కాటేసినా బాలుడిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రెండురోజులు ఆస్పత్రిలో ఉంచి పంపించేశారు. అయితే ఆ తరువాత బాలుడి కాలు వాచిపోయి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్‌ చేశారు.

ఇంటికి పంపే ముందు ఆ బాలుడితో ‘ఆస్పత్రికి చచ్చిన పామును తీసుకుని ఎందుకు వచ్చావు’ అని వైద్యులు ప్రశ్నించగా ‘నన్ను ఏ జాతి పాము కాటేసిందో తెలిస్తేనే కదా మీరు తగిన చికిత్స అందించేది’ అని బదులివ్వడంతో బిత్తరపోయారు. వైద్య బృందం అంతా కలిసి బాలుడి సాహసాన్ని, సమయోచిత తెలివితేటలను అభినందించారు.