విధాత, హైదరాబాద్:
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు ఒకరోజు ముందుగా బండి సంజయ్ కుటుంబంపై ఈ ఆరోపణలు రావడం బీజేపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. బండి కుమారుడిపై పోక్సో కేసు నిజమేనా అంటూ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన తెలంగాణ బీజేపీలో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తమ నుంచి ఫిర్యాదు తీసుకోకుండా తిరస్కరిస్తే న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని బాధితులు హెచ్చరించడంతో చివరకు పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదని తెలిసింది. మైనర్ అయిన తన కుమార్తెకు మద్యం తాగించి, లైంగిక దాడి చేశారని, దీంతో రెండుసార్లు ఆత్మహత్యకు పాల్పడిందని అమ్మాయి తల్లి ఆరోపిస్తున్నది. శుక్రవారం మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేయడంతో ఆరు గంటల పాటు హైడ్రామా నడిచింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసినట్లు సమాచారం. యువతితో పాటు తల్లి నుంచి వేధింపులు, బెదిరింపులు ఎక్కువ కావడంతో బండి భగీరథ్ కరీంనగర్ పట్టణంలో పోలీసు కేసు పెట్టారు. భగీరథ్ పెట్టిన కేసు వివరాలు బయటకు రాగా, యువతి తల్లిదండ్రులు పెట్టిన కేసు వివరాలు బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. దీనికి సంబంధించి పోలీసులు, బాధితులు కథనం ఈ కింది విధంగా ఉన్నాయి.
కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన బండి సాయి భగీరథ్ శుక్రవారం కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం అమ్మాయితో పాటు ఆమె తల్లిదండ్రుల నుంచి వేధింపులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆ అమ్మాయి తనతో స్నేహం చేసిందని, ఫంక్షన్లు, కుటుంబంలో జరిగే శుభ కార్యాలకు తనను పిలిచేదని వివరించాడు. ఆమెతో కలిసి పవిత్ర పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు తిరిగానని పేర్కొన్నారు. కొద్ది నెలల తరువాత పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరిగిందని, దీంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు కూడా డిమాండ్ చేశారని పేర్కొన్నారు. అడిగినంతగా డబ్బులు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతామని, ఇద్దరూ శారీరకంగా కలిసినట్లు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని తెలిపారు. బెదిరింపులు తట్టుకోలేక రూ.50వేలు అమ్మాయి తండ్రికి చెల్లించానని పేర్కొన్నారు. ఈ డబ్బులతో సంతృప్తి చెందకపోగా మరో రూ.5 కోట్లు తన నుంచి డిమాండ్ చేశారని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అమ్మాయి తల్లి బెదిరింపులకు దిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కరీంనగర్ టౌ టౌన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం అమ్మాయితో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఫిర్యాదు రాగా అర గంట వ్యవధిలో అనగా 5.30 గంటలకు బీఎన్ఎస్ సెక్షన్ 308(5), 351(2), ఆర్ డబ్ల్యూ 3 (5) కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా బాధిత యువతి తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది. 17 సంవత్సరాల వయసు ఉన్న బాలికకు డ్రగ్స్ అలవాటు చేయించారని, క్రమంగా ఆల్కహాల్ కూడా తాగడం నేర్పించారని ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు పర్యాటక ప్రాంతాల్లో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో బాధిత బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించిందని వాదన ఉంది. బాధితురాలి తల్లితండ్రులు తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కేసు పెట్టకపోవడంతో స్టేషన్ ఆవరణలో ఆరు గంటల పాటు హైడ్రామా నడిచింది. కేసు కట్టకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తల్లిదండ్రులు తీవ్రంగా హెచ్చరించడంతో తప్పని స్థితిలో వారి నుంచి ఫిర్యాదు తీసుకుని, కేసు నమోదు చేశారంటున్నారు. కాని ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఈ అంశం కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తలవంపులు తెచ్చే అంశమని, రాజకీయంగా తీరని నష్టం చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మహేంద్ర యూనివర్సిటీలో సహచర విద్యార్థిపై దాడి చేసిన ఘటన మరిచిపోక ముందే మరో కేసు నమోదు అయ్యిందంటున్నారు. సహచర విద్యార్థి సీతారామ్‌ను ర్యాగింగ్ పేరుతో బూతులు తిట్టడమే కాకుండా, ఆ వీడియోలను సోషల్ మీడియో వైరల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు భగీరథ్ పై కేసు నమోదు చేసి, నోటీసులు ఇచ్చారంటున్నారు.
