భారీ వర్షం.. కూలిన చార్మినార్ పెచ్చులు!

  • By: sr    news    Apr 03, 2025 6:48 PM IST
భారీ వర్షం.. కూలిన చార్మినార్ పెచ్చులు!

విధాత : హైదరాబాద్ లో గురువారం కురిసిన భారీ వర్షానికి చారిత్రాక ఐకానిక్ కట్టడం చార్మినార్ పెచ్చులూడింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షం ప్రభావంతో చార్మినార్‌లోని ఒక మీనార్‌ కు సంబంధించిన డిజైన్ నిర్మాణాల పెచ్చులు కూలి పడిపోయాయి.

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపున ఉన్న మీనార్‌లోని చివరి భాగంలో కొంత భాగం డిజైన్ కట్టడాల పెచ్చులు రాలిపడిన సమాచారం వేగంగా ప్రచారమవ్వడంతో ఇది చూసేందుకు స్థానికులు, పరిసర ప్రజలు అక్కడ భారీగా తరలివచ్చారు.

చార్మినార్ కు నాలుగు మీనార్‌లు ఉండగా, వాటిలో తాజాగా ఓ మీనార్‌కు పగుళ్లు ఏర్పాడ్డాయి. గతంలో ఒక మీనార్ కూడా పెచ్చులు ఊడి నేలపై పడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కట్టడాన్ని పరిశీలించారు. అనంతరం మరమ్మతు చర్యలు చేపట్టారు.

గోల్కొండ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ ను నిర్మించారు. క్రీస్తుశకం 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. చార్మినార్‌కి ఇలా పెచ్చులూడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలసార్లు పెచ్చులూడిన ఘటనలు ఉన్నాయి.

నిజానికి చార్మినార్ ప్రధాన కట్టడానికి సమస్య లేకపోయినా, చుట్టూ ఉండే సున్నపు మిశ్రమంతో చేసిన అదనపు నిర్మాణాలు కొంత కాలంగా దెబ్బతింటూ వస్తున్నాయి. భారత పురావస్తు శాఖ దీనికి మరమ్మతులు చేపడుతూనే ఉంది. అయితే తాజాగా కురిసిన భారీ వర్షానికి పెచ్చులు ఊడిపడటం ఆందోళన కరంగా మారింది.