Acb | లంచావ‌తారాలు.. ఏసీబీ వలలో ఒకే రోజు ఐదుగురు! అందులో ఓ టీవీ రిపోర్టర్!

  • By: sr    news    Apr 21, 2025 8:31 PM IST
Acb | లంచావ‌తారాలు.. ఏసీబీ వలలో ఒకే రోజు ఐదుగురు! అందులో ఓ టీవీ రిపోర్టర్!

విధాత: తెలంగాణ ఏసీబీ అధికారులు వేర్వేరు జిల్లాల్లో నిర్వహించిన దాడుల్లో ఇద్దరు అధికారులను, ఓ టీవీ రిపోర్టర్ ను లంచం సొమ్ముతో పట్టుకున్నారు. మణుగూరు పోలీస్ స్టేషన్ సీఐ ఎస్.సతీష్ కుమార్, బిగ్ టీవీ రిపోర్టర్ ఎం.గోపితో కలిసి ఓ కేసులో ఫిర్యాదు దారుడితో పాటు అతని బంధువుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు రూ.4లక్షలు డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో బాధితుడు రూ.1లక్ష రూపాయలను వారికి అందచేస్తుండగా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం సొమ్ముతో సహా పట్టుకున్నారు. మరో కేసులో ఎఫ్ టీఎఫ్ నిధుల మంజూరుకు సంబంధించి ఆర్మూర్ పంచాయతీ రాజ్ శాఖ సీనీయర్ అసిస్టెంట్ ఎన్.శ్రీనివాస శర్మ ఫిర్యాదుదారుడిని రూ.7,500లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి శ్రీనివాస శర్మను లంచం సొమ్ముతో సహా పట్టుకుంది.

అదే విధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారం మునిసిపల్ ఆఫీసులో Dy.E.E సుదర్శనం రఘు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు (అవుట్‌సోర్సింగ్) V. రాకేష్, V. సురేష్ లు CC రోడ్ వర్క్ పెండింగ్ రూ.11,00,000/- బిల్లులు క్లియర్ చేయడానికి గాను 1,30,000 లంచం డిమాండ్ చేసి, రూ. 1,00,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

 

జనగామ జిల్లాలో బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని చిల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు చేయగా ఆర్ ఐ వినయ్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేయగా బాధితులు సోమవారం రూ.26 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆర్ ఐని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా చిల్పూర్ మండల కేంద్రంలో ఏసీబీ దాడులు జరగడంతో తీవ్ర చర్చగా మారింది.