ఆన్‌లైన్‌ గేమ్‌లో హీరో అక్షయ్‌ కుమార్తె నగ్న చిత్రాలు అడిగిన నీచుడు

పిల్లలు మొబైల్‌లో ఆటలాడుకునే సందర్భాన్నీ కొందరు నీచులు సావకాశం చేసుకుంటున్నారు. నగ్న చిత్రాలు పంపాలని ఒత్తిడి చేస్తున్నారు. హీరో అక్షయ్‌ కుమార్‌ తన కుమార్తెకు ఎదురైన ఇటువంటి అనుభవం గురించి వివరించారు.

  • By: TAAZ    news    Oct 03, 2025 9:55 PM IST
ఆన్‌లైన్‌ గేమ్‌లో హీరో అక్షయ్‌ కుమార్తె నగ్న చిత్రాలు అడిగిన నీచుడు

ఒకప్పుడు విద్యార్థులు క్రీడా మైదానాలు, ఇంటి వద్ద ఆడుకునే వారు. కంప్యూటర్ యుగంలో లాపీ లేదా ట్యాబ్, మొబైల్ లో ఆటలాడుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. కానీ.. ఆన్‌లైన్‌ గేమ్స్‌లో ఆర్థిక మోసాలే కాదు.. ఇతరత్రా మోసాలకు కూడా నీచులు పాల్పడుతున్నారు. ఇటువంటి అనుభవం హీరో అక్షయ్‌ కుమార్‌ కుమార్తెకు ఎదురైంది. ఆయనే స్వయంగా వివరాలు ఒక కార్యక్రమంలో వెల్లడించారు. అందరి పిల్లల మాదిరే తన కుమార్తెకు ఆన్ లైన్ గేములు ఆడే అలవాటు ఉందన్నారు. కొన్ని నెలల క్రితం తన ఇంట్లో ఆన్‌లైన్‌ గేమ్‌ల మాటున నా కుమార్తె కూడా సైబర్‌ వేధింపులకు గురైందన్నారు. తన 13 ఏళ్ల కుమార్తె ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లు ఆడుతుండేదని, కొన్నిసార్లు పరిచయం లేని వ్యక్తులతో ఆడాల్సి వచ్చేదన్నారు.

ఆడే సమయంలో తొలుత బాగా ఆడుతున్నావంటూ మెస్సేజి వచ్చిందన్నారు. మీరు ఎక్కడివారు… అమ్మాయా? అబ్బాయా? అని అడిగేవారు. అమ్మాయి అని మెస్సేజి పెట్టగానే… న్యూడ్‌ ఫోటోలు పెట్టాలని అడిగారని అక్షయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వెంటనే తన కుమార్తె ఆందోళనకు గురై వీడియో గేమ్ ఆపేసిందన్నారు. ఆ తరువాత తన తల్లికి జరిగిన విషయాన్ని వెల్లడించడం, తనకు తెలియడం జరిగిందన్నారు. తన కుమార్తె కు జరిగినట్లుగానే ప్రతి ఆడబిడ్డకు జరిగి ఉంటుందని భావిస్తున్నానని అక్షయ్ తెలిపారు. ప్రతి వారం 7 నుంచి 9వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి సైబర్ క్రైమ్స్ పై ప్రత్యేక తరగతి నిర్వహించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆయన కోరారు. ఇలాంటివి వీధి నేరాల కంటే ప్రమాదకరమని, సైబర్ క్రైమ్స్ ను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్షయ్ కుమార్ తెలిపారు.