పైసలు తీసుకుని ఓటేస్తే.. జంతువులై పుడతారు: బీజేపీ ఎమ్మెల్యే

విధాత : మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉషా ఠాకూర్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలకు లొంగే ఓటర్లు మరో జన్మలో జంతువులుగా పుడతారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను ఉషా ఠాకూర్ కోరారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల ద్వారా ప్రతి లబ్ధిదారుడి ఖాతాల్లోకి వేల రూపాయలు వస్తున్నాయని తెలిపారు. ఓటును అమ్ముకుంటే అది మనుషులకే సిగ్గుచేటని చెప్పుకొచ్చారు. ఓటు వేసేటప్పుడు చిత్తశుద్ధిని కోల్పోవద్దన్నారు. ‘డబ్బు, చీరలు, గాజులు, మద్యం తీసుకుని ఓటు వేసే వారు వచ్చే జన్మలో ఖచ్చితంగా ఒంటెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, పిల్లులుగా పుడుతారన్నారు. ఇది మీ డైరీలో రాసుకోండని.. ప్రజాస్వామ్యాన్ని అమ్ముకునే వారు మళ్లీ జన్మలో ఇలా జంతువులవుతారని వ్యాఖ్యానించారు. దేవుడితో నాకు ప్రత్యక్ష సంభాషణ ఉందని.. నన్ను నమ్మండని..దేశం, మతం, సంస్కృతికి సేవ చేసే బీజేపీకి మాత్రమే ఓటు వేయాలని కోరారు.
ఉషా ఠాకూర్ మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏప్రిల్ 16న మోవ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హసల్‌పూర్ గ్రామంలో జరిగిన సమావేశంలో ఉషా ఠాకూర్ మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలను ప్రతిపక్షాలు, నెటిజన్లు తప్పుపడుతున్నారు. అయితే తన వ్యాఖ్యలను ఉషా ఠాకూర్ సమర్థించుకుున్నారు. మన పనుల ఆధారంగా మనకు తదుపరి జీవితం లభిస్తుందని..మన పనులు చెడ్డవి అయితే, మనం మనుషులుగా తిరిగి జన్మించబోమని తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మృణాల్ పంత్ మాట్లాడుతూ ఉషా ఠాకూర్ ప్రకటన ఆమె “సంప్రదాయవాద ఆలోచనతో పాటు స్థానిక బీజేపీ నాయకుల మధ్య అంతర్గత కలహాన్ని కూడా సూచిస్తుందని చురకలేశారు. ఉషాఠాకూర్ గతంలోనూ దేశంలో మదర్సాలు, ఇస్లామిక్ విద్యాసంస్థలు మతతత్వం, ఉగ్రవాదాన్ని పెంచుతున్నాయని వాటిని నిలిపివేయాలని వ్యాఖ్యానించడం వివాదస్పదమైంది.