Breaking: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్దరణ.. జీపీవోగా పేరు మార్పు

రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954గ్రామ పాలనాధికారుల నియామకం !
Breaking | Telangana | VRO | GPO
విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 మంది గ్రామ పాలనాధికారుల(GPO )ను నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలనాధికారుల పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ” జీపీవో( GPO)” గా నామకరణం చేసింది. ఇప్పటిదాక వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఆప్షన్లను తీసుకుని గ్రామ పాలనాధికారులుగా నియమకాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వో, వీఆర్ఏలను జీపీవో పేరుతో పునరుద్ధరించినట్లయ్యింది.
బీఆర్ఎస్ రద్దు చేసింది.. కాంగ్రెస్ పునరుద్ధరించింది
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిందని, క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల అవసరమేలేదనే అభిప్రాయంతో 2022లో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దుచేసింది. అప్పటికే వీఆర్‌వోలుగా, వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నవారిని వారి అర్హతల ఆధారంగా ఇతర శాఖలల్లోకి బదలాయించింది. జూనియర్ అసిస్టెంట్లుగా, సీనియర్ అసిస్టెంట్లుగా, అటెండర్లుగా ఇతర శాఖల్లో సర్ధుబాటు కావడంతో నానా పాట్లు పడ్డారు. వీఆర్‌వో అంటే గ్రామంలో కీలకమైన అధికారిగా కేవలం భూముల రికార్డుల నిర్వహణకే పరిమితం కాకుండా, అధికారుల పర్యటనలు, ప్రజాప్రతినిధుల పర్యటనల సందర్భంలో కీలకంగా వ్యవహరించేవారు. అలాంటి కీలకమైన వ్యవస్థను గత ప్రభుత్వం నిందారోపణలతో రద్దుచేసిందనే అభిప్రాయంతో ఉన్న వీఆర్వోలు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పేరుతోనైనా మళ్లీ ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజాం హయాం నుంచి నేటి దాక!
నిజాం హయాం నుంచి రాష్ట్రంలో ఈ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. భూరికార్డుల నిర్వహణ, గ్రామంలో నిఘా వ్యవస్థతో పాటు, భూముల పన్నుల వసూళ్లు, ఎన్నికల సమయంలో గ్రామాధికారిగా విధులు నిర్వహించేవారు. అదేవిధంగా ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు ఇవ్వడం, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాథమి క సమాచారమివ్వడం, పంచనామాలు నిర్వహించడం వంటి బాధ్యతలు చూసేవారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దులో భాగంగా 1984లో వీఆర్వో వ్యవస్థ మొదటిసారి రద్దయింది.
ఆతర్వాత 1985లో వీఏవోలను నియమించారు. తదుపరి 1992లో మళ్లీ రెవెన్యూ బాధ్యతలతో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిని నియమించారు. 2002లో మళ్లీ వీఏవోలను రద్దు చేసి పంచాయతీ కార్యదర్శులను నియమించారు. ఆ తర్వాత తిరిగి 2007లో పంచాయతీ కార్యదర్శుల నుంచి రెవెన్యూను విడదీసి మళ్లీ వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2022లో మళ్లీ వీఆర్వో వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా గ్రామ పాలనాధికారి పేరుతో మళ్లీ పాత వ్యవస్థను పునరుద్ధరించారు. ఈసారైనా పక్కాగా అవినీతి, అక్రమాలకు పాల్పడితే సర్వీస్ నుంచి రిమూవ్ చేసేలా జీవో కూడా ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.