MLA Janampalli Anirudh Reddy | నిధులన్నీ ఖమ్మం జిల్లాకేనా.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, జిల్లా కు చెందిన నేతనే ముఖ్యమంత్రి గా ఉన్నా నిధులు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాకు మాత్రం నిధుల వాన కురిపిస్తున్నారని విమర్శించారు.

- నిధులన్నీ ఖమ్మం జిల్లాకేనా
- కరువు జిల్లా మహబూబ్‌నగర్ కనపడడం లేదా?
- కేటాయించిన నిధులపై అసెంబ్లీ లో నిలదీస్తా
- 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా తీవ్ర అన్యాయం
- పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యే కు రూ.25 కోట్లు ఇవ్వాలి
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, జిల్లా కు చెందిన నేతనే ముఖ్యమంత్రి గా ఉన్నా నిధులు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాకు మాత్రం నిధుల వాన కురిపిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు నిధుల కేటాయింపు లో జరుగుతున్న అన్యాయం పై ఆయన మీడియాతో తన అభిప్రాయం వెలిబుచ్చారు.
ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు కేటాయించిన నిధులపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తేల్చుకుంటానని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి కోసం రూ.25 కోట్ల చొప్పున నిధులు కేటాయించి కలెక్టర్ ఆధ్వర్యంలో నిధులు జమచేస్తే అవి జిల్లా కలెక్టర్ ద్వారా గ్రామాల్లో ప్రతి సమస్యలను తీర్చే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల బాగుకోసం వాడుకుంటే సమస్య లు సత్వరమే తీర్చినట్లు అవుతుందని అనిరుద్ రెడ్డి అన్నారు.
నిధుల విషయంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు చాలా అన్యాయం జరుగుతోందన్నారు. ఇంతవరకు ఖమ్మం, నల్లగొండ జిల్లా లకు ఎన్ని నిధులు వెళ్లాయి, మహబూబ్ నగర్ జిల్లా కు ఎన్ని నిధులు వచ్చాయి అనే విషయం పై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వివరాలు తెలుసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిధుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెనుకబడిన జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను జిల్లాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటారని అనిరుద్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.