ఇక్కడ కవిత కుమారుడు..అక్కడ వైఎస్ షర్మిలా కొడుకు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కుమారుడు ఆదిత్య బీసీ బంద్‌లో, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి కర్నూలు ఉల్లి మార్కెట్‌లో తల్లులతో కలిసి సందడి చేశారు. ఇద్దరూ తమ రాజకీయ వారసులను తెరపైకి తెచ్చారు.

విధాత: తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిలకు చాల విషయాల్లో పోలిక కనిపిస్తుంటుంది. ఇద్దరు కూడా కుటుంబంలో ఆస్తుల గొడవలతో పాటు, తమ అన్నలు కేటీఆర్, జగన్ లతో పేచీలు, రాజకీయంగా సొంత పార్టీల నుంచి గెంటివేతలకు గురైన వారే. వారిద్దరు ప్రస్తుతం సొంతంగా తమ రాజకీయ ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ నుంచి తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తుంది. కవిత తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ యాత్రకు సిద్దమవుతుంది. తాజాగా వారి వారసులను కూడా వారు రాజకీయ తెరపైకి తేవడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులోనూ వారిద్దరి మధ్య మంచి పోలికే కుదిరింది.
ఇటీవల కర్నూలు ఉల్లి మార్కెట్ కి తల్లి షర్మిలతో కలిసి ఆమె కుమారుడు రాజారెడ్డి సందడి చేశారు. తాజాగా బీసీ బంద్ లో పాల్గొన్న కవిత కుమారుడు ఆదిత్య సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇలా తెలుగు రాష్ట్రాల పొలిటికల్ స్క్రీన్ పై కవిత, షర్మిల రాజకీయ వారసులు తళుక్కుమన్నారు. ఒకవైపు తమ రాష్ట్రాలలో తమ రాజకీయ ఆధిపత్య పోరాటాన్నికొనసాగిస్తునే..మరోవైపు తమ వారసుల భవిష్యత్ కు కవిత, షర్మిలలు రాజకీయ బాటలు వేస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.