Komatireddy Venkat Reddy | అభివృద్ధి, సంక్షేమంతో ముందడుగు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy | రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్దికి ప్రజా సంక్షేమ పథకాలు..అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ లతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.82 కోట్లతో 250 పడకల ఆసుపత్రి, రూ.11.5 కోట్లతో మాత శిశు ఆరోగ్య కేంద్రం, కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రూ.77 కోట్లతో నాలుగు వరుసల రహదారి ప్యాకేజీ-2, సుందరగిరి నుండి కొత్తపల్లి వరకు రూ.80 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం మహిళా సంఘాలకు మంజూరై రూ.71.30 కోట్ల చెక్ ను మంత్రులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల పంట పెట్టుబడి మద్దతు అందించామని తెలిపారు. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ పూర్తి చేశామని వెల్లడించారు. గత పాలకులు హుస్నాబాద్ కోసం ఏమీ చేయలేదని..గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తికాలేదన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టు కాలువల పనులు వేగంగా కొనసాగిస్తుందని తెలిపారు. ఎన్ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్ ద్వారా ప్రజాజీవితంలో ఉన్న పొన్నం ప్రభాకర్ అభివృద్ధి సాధించే నాయకుడని..గల్లీగల్లీ తిరుగుతూ ప్రజలతో ఉంటారని గుర్తు చేశారు. ప్రాంతాలకు సంబంధం లేకుండా మంచికి మద్దతుగా ఉంటామని హామినిచ్చారు. అభివృద్ధి కోసం మేమంతా కలిసి పనిచేస్తామని వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.