Hyderabad: మగవారి రక్షణకు.. హీ టీమ్స్ ఏర్పాటు చేయండి! ఇందిరా పార్క్ వ‌ద్ద పురుషుల‌ ధ‌ర్నా

  • By: sr    news    Apr 05, 2025 2:55 PM IST
Hyderabad: మగవారి రక్షణకు.. హీ టీమ్స్ ఏర్పాటు చేయండి! ఇందిరా పార్క్ వ‌ద్ద పురుషుల‌ ధ‌ర్నా

విధాత: మహిళల రక్షణకు షీ టీమ్స్, మహిళలకు జరిగే అన్యాయాలపై చర్యలకు మహిళా కమిషన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మగవారి రక్షణకు కూడా హీ టీమ్స్ , మెన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ క్రమంగా దేశంలో ఊపందుకుంటుంది. హైదరాబాద్ లో సైతం ఇదే డిమాండ్ తో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం వైరల్ గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా సహా పలువురు అడ్వకేట్లు, మహిళా బాధితులు మగవారి రక్షణకు హీ టీమ్స్, మెన్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా శేఖర్ బాషా మాట్లాడుతూ మగవారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళల రక్షణకు ఉన్న చట్టాల కారణంగా పురుషులపై మహిళల సాధింపులు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. మగవాళ్లను తిట్టినా, దాడి చేసినా రక్షణ చట్టాలు లేవన్నారు. దీంతో మహిళా బాధిత పురుషుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోతుందన్నారు. పవన్ కల్యాణ్ వాళ్ల అమ్మను తిట్టిన వారు జైలులో ఉన్నారని.. మరి అలా తిట్టిన ఆడవాళ్ల సంగతేమిటని ప్రశ్నించారు.

మహిళలకు ఉన్న చట్టపరమైన, న్యాయపరమైన రక్షణ చట్టాల ముసుగులో పురుషులపై వేధింపులకు పాల్పడుతూ కొందరు మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళల బాధితులు ఎక్కువవుతున్నారని పేర్కొన్నారు. సమాజంలో, రాజ్యాంగ పరంగా అందరూ సమానమైనప్పుడు చట్టాలలో వివక్షత, అసమానతలు సరికావన్నారు అందుకే పురుషులకు కూడా మహిళల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. SHE టీమ్స్ తరహాలో HE టీమ్స్ ఏర్పాటు చేయాలని, మెన్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.