Hidma arrest: హిడ్మా అరెస్ట్?

– ఒడిశా కోరాపూట్ లో అదుపులోకి..!
– అధికారికంగా ధ్రువీకరించని పోలీసులు
– మావోయిస్టులకు వరస నష్టాలు
Hidma arrest: విధాత ప్రత్యేక ప్రతినిధి: మావోయిస్టు కీలక నేత హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఒడిశాలోని కొరాపుట్‌లో గురువారం అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఆయన దగ్గర ఏకే 47 రైఫిల్, మందుగుండు సామగ్రి, డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
పోలీసులు అదుపులోకి తీసుకున్నది మావోయిస్టు పార్టీ కీలక నేత పీఎల్ జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ మడావి హిడ్మానా.. లేదంటే మావోయిస్టు పార్టీలో ఉన్న మరో నాయకుడు కుంజా హిడ్మాను అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు అధికారికంగా ప్రకటన చేస్తే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.
మావోయిస్టు పార్టీ దెబ్బమీద దెబ్బ
ఇటీవల మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పటికే పలువురు మావోయిస్టు పార్టీ నేతలు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సైతం ఇటీవల కేంద్ర బలగాల ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
హిడ్మా కోసం చాలా రోజులుగా వేట
మావోయిస్టు పార్టీ పీఎల్ జీఏ మొదటి బెటాలియన్ చీఫ్ మడావి హిడ్మా కోసం చాలాకాలంగా తీవ్రమైన వేట కొనసాగుతున్నది. మిలిటరీ ఆపరేషన్లలో హిడ్మాదే కీలక పాత్ర అని చెబుతుంటారు. చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరిన హిడ్మా ఉన్నత స్థాయికి ఎదిగారు. మావోయిస్టులు, సాయుధ బలగాల మధ్య జరిగిన అనేక దాడుల్లో అనేక దాడులలో హిడ్మా కీలక పాత్ర పోషించారు. సుగ్మా టీంగా పేరొందిన హిడ్మా బెటాలియన్ దాడి చేస్తే ఎదుటి వ్యక్తి తప్పించుకోలేడని మావోయిస్టు పార్టీలో చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే హిడ్మా టార్గెట్ గా సాయుధబలగాలు తీవ్రమైన వేటను కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ లో ఆయనదే కీలక భూమికగా చెబుతారు.
కర్రెగుట్టలలో భారీ ఆపరేషన్
కర్రెగుట్టలలో ఇటీవల పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలోని కర్రెగుట్టలను 18 రోజులపాటు 25 వేల మంది సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ కూలింగ్ సందర్భంగా రెండు దఫాలుగా జరిగిన ఎదురు కాల్పులలో 25 మందికి పైగా మావోయిస్టు పార్టీ ప్రతినిధులు మృత్యువాత పడ్డారు. అత్యాధునిక ఆయుధాలు హెలికాప్టర్లను ఆధునిక తుపాకులను సాయుధ బలగాలు ఈ సందర్భంగా వినియోగించారు. కర్రెగుట్టలలో హెడ్ మాతో పాటు ఆ పార్టీ ప్రధాన నాయకులు షెల్టర్ తీసుకున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయినప్పటికీ హిడ్మా ఆచూకీ లభించలేదు. అక్కడినుంచి పోలీసుల కన్నుగప్పి మహారాష్ట్ర లేదా ఒరిస్సా వైపు వెళ్లారని ప్రచారం అప్పట్లో సాగింది. ఈ నేపథ్యంలో తాజాగా అరెస్ట్ అయ్యింది హిడ్మానేనా అన్న విషయంపై పోలీసుల ప్రకటన తర్వాత క్లారిటీ రానున్నది.