బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్: భవిష్యత్తు కార్యాచరణపై కవిత సమాలోచనలు
కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్; తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను, తెలంగాణ జాగృతితో తదుపరి పథకాలను సమాలోచన చేస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై సన్నిహితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాలోచనలు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతితో పాటు తన అభిమానులతో ఈ విషయమై చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ తనపై సస్పెన్షన్ విధించడంపై ఆమె స్పందించనున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణను కూడా ఆమె ప్రకటించే అవకాశం ఉంది.
కొంతకాలంగా ఆమె జాగృతిని తన రాజకీయ ప్రయాణానికి వేదికగా ఎంచుకున్నారు. జాగృతి ద్వారానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జాగృతి ద్వారా ఆమె చేస్తున్న కార్యక్రమాలు కొన్ని సమయాల్లో బీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందిగా మారాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ విధానానికి భిన్నంగా ఉన్నాయి. గతంలో కవిత కార్యక్రమాలు, పర్యటనల్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనేవారు. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో కవిత కార్యక్రమాలకు, పర్యటనలకు బీఆర్ఎస్ కార్యకర్తలు దూరంగా ఉన్నారు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు, కవితకు మధ్య గ్యాప్ ఉందని తేలింది. రోజు రోజుకు ఇది పెరుగుతూనే వచ్చింది. కాళేశ్వరం అంశంలో అవకతవకల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై ఆమె మీడియా సమావేశంలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ ను టార్గెట్ చేసుకొని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.