Warangal: అమెరికన్ సామ్రాజ్యవాద అనుకూల మోడీ విధానాలు

విధాత, వరంగల్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న సామ్రాజ్యవాద దురహంకార విధానాలకు మద్దతు ఇస్తూ భారత దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు విమర్శించారు. రష్యా సోషలిస్టు విప్లవ నిర్మాత కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి, సిపిఐ ఎంఎల్ పార్టీ 56వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం ఖిలా వరంగల్లో న్యూ డెమోక్రసీ నాయకులు కామ్రేడ్ బండి కోటేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన దేశానికి వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ తో మోడీ దేశానికి నష్టకరమైన రక్షణ ఇంధన మరియు స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో వ్యవసాయం పాడి పరిశ్రమ తదితర రంగాలలో అవమానకరమైన ఒప్పందాలు చేసుకునే ప్రమాదం ఉందని ఆయన అన్నారు .
అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల జీవితాలతో దురంకార ట్రంప్ చెలగాటమాడుతుంటే ఇక్కడ మోడీ జె .డి వ్యాన్స్ పిల్లలతో ఆటలాడుకుంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు, దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నాడని అన్నారు అలాగే మధ్యభాగంలో ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసి జాతి ప్రజలపై మారణకాండ కొనసాగిస్తున్నాడని ఆయన అన్నారు.కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా , వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పి డి ఎస్ యు రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు తీగల జీవన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళిత ఆదివాసీ బహుజనులపై హిందూ మతోన్మాద దాడులు పెరుగుతున్నాయ న్నారు .కేంద్ర ప్రభుత్వం మనువాద విధానాలు అనుసరిస్తూ రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులను హరిచేస్తుందని ఆయన విమర్శించారు .ఈ సమయంలో విప్లవ పార్టీల ఐక్యత ఆవశ్యకత ఏర్పడిందని ఆయన తెలియజేశారు.పి డి ఎస్ యు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ మాట్లాడుతూ రష్యా సోషలిస్టు నిర్మాత కామ్రేడ్ లెనిన్ చేసిన పోరాటాలను విజయాలను అధ్యయనం చేయాలని మనదేశంలో కూడా నూతన ప్రజా స్వామిక విజయవంతం కోసం జరుగు పోరాటాలలో విద్యార్థులు పాల్గొనాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు భైరబోయిన ఐలయ్య, పి వై ఎల్ జిల్లా నాయకులు గండ్రతి హరిబాబు, పిడిఎస్యు జిల్లా నాయకులు రాజేష్, ఐఎఫ్టియు నాయకులు గద్దల ప్రభాకర్, ఎండి ఖాన్, పాలకుర్తి సత్యనారాయణ, ఇనుముల కృష్ణ , సుద్దాల వీరన్న లతోపాటు బండి రవి, మన్నే కరుణాకర్, అయితే యాకయ్య , రాతి పెళ్లి కృష్ణ, ఎండి అక్బర్ ,పుప్పాల రవి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.