Nalgonda POCSO Court : కామంధులకు కఠిన శిక్షలు..నల్లగొండ పోక్సో కోర్టు తీర్పులు

నల్లగొండ పోక్సో కోర్టు వరుస తీర్పులు: బాలికలపై అత్యాచారం చేసిన నిందితులకు 20–51ఏళ్ల జైలు శిక్షలు, జరిమానాలు, పరిహారం విధింపు.

Nalgonda POCSO Court  : కామంధులకు కఠిన శిక్షలు..నల్లగొండ పోక్సో కోర్టు తీర్పులు

విధాత, నల్లగొండ : బాలికలు..మహిళలపై అత్యాచారాలు..హత్యలకు పాల్పడిన కామాంధులకు నల్లగొండ పోక్సో కోర్టు కఠిన శిక్షలు విధిస్తూ వరుస తీర్పులతో సంచలనం సృష్టిస్తుంది. మంగళవారం పోక్సో కోర్టు వెలువరించిన తీర్పులో 10 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 23 ఏళ్ల జైలు శిక్ష, 40 వేల రూపాయల జరిమాన విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీర్పు వెలువరించింది.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల మేరకు నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య(60) నాల్గవ తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ అమ్మాయిపై ఇంట్లో ఎవరు లేని సమయం చూసి.. అత్యాచారనికి పాల్పడి, ఎవరికైనా చెప్పితే చంపుతానని బెదిరించాడు. బాధిత బాలిక జరిగిన విషయంపై తన తల్లికి చెప్పగా..ఈ ఘటనపై 2023మార్చి 29న నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు ఊషయ్యను దోషిగా నిర్ధారించి 23 సంవత్సరాల జైలు 40 వేల రూపాయల జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించింది.

నల్గగొండ పోక్సో కోర్టు సోమవారం మరో కేసులో మూడో తరగతి చదువుతున్న 8ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు చిట్యాల మండలం వానిపాకల గ్రామానికి చెందిన దోమల రాములును దోషిగా నిర్ధారించింది. 2028 ఫిబ్రవరిలో నమోదై విచారణ కొనసాగిన ఈ కేసులో దోషిగా తేలిన రాములుకు 21 ఏళ్ల జైలు శిక్ష, 30 వేల రూపాయల జరిమాన విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.10 లక్షల రూపాయల పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీర్పు వెలువరించింది.

ఆ కేసుల్లోనూ కఠిన శిక్షలు

అంతకుముందు అలాగే కట్టంగూర్ మండలం దూగినవెల్లి గ్రామానికి చెందిన జడిగిల హరీష్ అనే నిందితుడుకి ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసి మోసగించిన కేసు(2018జూలై)లో 21ఏళ్ల జైలు శిక్ష, 30వేల జరిమాన విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.5లక్షల పరిహారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన చండూరు మండలం దోనిపాములకు గ్రామానికి చెందిన తిప్పర్తి యాదయ్య(2016 డిసెంబర్) కేసులో నిందితుడికి 22ఏళ్ల జైలు శిక్ష, 35వేల జరిమానా విధిస్తూ..బాధితురాలికి రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు నిచ్చింది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన మరో కేసులో దేవరకొండ మండలం గొట్టిముక్కలకు చెందిన ముకుటూజు భాస్కరచారికి 20ఏళ్ల జైలు శిక్ష, 25వేల జరిమాన, బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.

ఏడాది వ్యవధిలో 19కేసుల్లో ఒకరి మరణ శిక్ష..19మందికి జైలు శిక్షలు

గడిచిన సంవత్సర కాలంలో నల్లగొండ పోక్సో కోర్టు 19కేసులలో 20మంది దోషులలో ఒకరికి ఉరి శిక్ష, 19మందికి జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ తీర్పునివ్వడం గమనార్హం. వాటిలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం కేసులో తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూం అనే నిందితుడికి 51ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 11ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసి చంపిన కేసులో నిందితుడు మహ్మద్ ముక్రంకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు, పోక్సో కోర్టు నిందితుడికి మరణ శిక్ష, డబుల్ డెత్ ఫెనాల్టీ కింద రూ.1,10,000జరిమానా, బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.