బభ్రాజమానం, భజగోవిందం!.. బీఆరెస్ మ్యానిఫెస్టోపై నెటిజన్ల చురకలు
'సరుకు లేదు,సంగతి లేదు, సబ్జెక్టులేదుఆబ్జెక్టు లేదు. శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు.అంతా వట్టిదే డబ్బా.బభ్రాజమానం, భజగోవిందం' కేంద్రబడ్జెట్‌పై కేసీఆర్ స్పందన ఇది

- కాంగ్రెస్ పథకాల కాపీపై ట్రోలింగ్
విధాత : ‘సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు ఆబ్జెక్టు లేదు. శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు. అంతా వట్టిదే డబ్బా. బభ్రాజమానం, భజగోవిందం’ కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ స్పందన ఇది. ఇవాళ బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కూడా ఇలానే ఉన్నదని నెటీజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ప్రజల్లోకి వెళ్లాయి. వాటి గురించి చర్చ జరుగుతున్నది. దాన్ని అధిగమించడానికే సీఎం తమ మ్యానిఫెస్టోలో ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. అంతేకాదు కర్ణాటకలో ఐదు గ్యారెంటీ హామీలు ఇచ్చింది. అధికారంలోకి చేపట్టిన నాటి నుంచే వాటి అమల్లోకి తెచ్చింది.
ఇక్కడ కూడా తమకు అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీ హామీలు తప్పకుండా అమలు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీఆరెస్ శ్రేణులు పోస్టులు పెట్టాయి. కర్ణాటకలోనే పథకాలు అమలు కావడం లేదని ఆ పార్టీ నేతలు సైతం విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదని అన్నారు. మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆచరణ సాధ్యం కానప్పుడు అంతకుమించి బీఆరెస్ ఇచ్చిన హామీలు ఎలా అమలు సాధ్యమో సీఎం చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బీఆరెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే పూర్తిస్థాయిలో అమలు కాలేదు. డబుల్‌బెడ్ రూమ్‌లు పూర్తికాలేదు. లబ్ధిదారులందరికీ అందలేదు. ఈలోగానే సొంత జాగా ఉన్నవాళ్లకు రూ. 3 లక్షలు ఇస్తామని మరో హామీని తెరమీదికి తెచ్చింది. అలాగే 2014 ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి హామీ అమలు చేయలేదు. మళ్లా దళితబంధును ముందుపెట్టి ఆ పథకాన్ని అటకెక్కించిందనే విమర్శలు ఉన్నాయి. ఈ పథకాలు అర్హులందరికీ అందడం లేదు. అందుకే బీఆరెస్ పథకాలు ఒక ఊరిలో కొంతమందికి మాత్రమే దక్కి మిగిలిన వారికి రాకపోవడంతో ఇవే ఈసారి ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థులకు మైనస్‌గా మారుతున్నదంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమౌతున్నదట.
ఉద్యోగాల భర్తీ హామీ అమలు కాకపోగా నియామకాలు అనేవి ఎండమావిగానే మారిపోయాయి. సాక్షాత్తు సీఎం ఇచ్చిన హామీనే గత ఏడాదిన్నరకాలంగా అమల్లోకి రాలేదు. పరీక్షలు రద్దు, ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడటం వంటి వాటిపట్ల నిరుద్యోగులు ఈ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పట్లో ఈ పరీక్షలు జరిగే అవకాశం లేదని సొంత ఊళ్లకు పయనమయ్యారు. అక్కడికి వెళ్లిన వాళ్లు ఊరికే ఉండటం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారని సమాచారం.
అలాగే తాజా మ్యానిఫెస్టోలోనూ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి హామీలు లేవు. ఒకవేళ అలాంటి ప్రకటన ఏదీ చేసినా నిరుద్యోగులు విశ్వసించే పరిస్థితి లేదు. అలాగే సీపీఎస్ రద్దు అంశం, 317 జీవో వంటివి అంశాలపై ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. వారిని అసంతృప్తిని చల్లార్చడానికి ఈసారి మ్యానిఫెస్టోలో ఓపీఎస్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మేది లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తెగేసి చెబుతున్నాయని తెలుస్తోంది.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి తొమ్మిదిన్నరేళ్లుగా ప్రభుత్వం ఇదిగో అదిగో అనడమే గాని ఇప్పటికీ దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు జర్నలిస్టుల సమస్యలుగాని, వారి ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. ఈసారి మ్యానిఫెస్టోలో వారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ, ఆరోగ్యబీమా వంటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్‌పై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీనివల్ల ఊర్లలో లేని సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోతున్నారు. వారి కొన్ని సమస్యల పరిష్కారం కలెక్టర్ చేతిలో కూడా లేదని సీఎస్ వరకు వెళ్లాల్సి వస్తున్నదంటున్నారు. ఒక రైతు ఊరు దాటి హైదరాబాద్‌కు రావాల్సిన దుస్థితికి కారణమైన ధరణిపై రైతులు మండిపడుతున్నారు. అలాగే రైతుబంధు పథకానికి 5-10 వరకు సీలింగ్ పెట్టాలని కోరుతున్నారు. ఆ పథకం వల్ల చిన్న, సన్నకారు రైతులు, నిజంగా వ్యవసాయం చేసే వారికి కాకుండా పడావు పడి, వ్యవసాయం చేయని వారే ఎక్కువ లబ్ధి జరుగుతున్నదని వారు ఆరోపిస్తున్నారు.
ఇలా ఒకవర్గం కాదు అనేకవర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల వలె సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేసే పరిస్థితి ఉండబోదని, ఎమ్మెల్యేల పనితీరే ప్రామాణికం కాబోతున్నదంటున్నారు. ఇవన్నీ బీఆరెస్ కు డేంజర్ బెల్స్ గా మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు.