Operation Kagar: 18 మంది మావోయిస్టుల లొంగుబాటు

Operation Kagar: ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో మావోయిస్టులను వెంటాడుతున్నది. ఇటీవల మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు సైతం ఎన్ కౌంటర్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల వరస ఎన్ కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల లొంగుబాటులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. వీరంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన వారని పోలీసులు చెప్పారు.
వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరి మీద మొత్తం 38 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. మంగళవారం సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట వీరు లొంగిపోయారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఇటీవల నక్సల్ రహిత గ్రామ పంచాయతీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా భారీగా లొంగుబాట్లు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.