MLC KAVITHA | ఆపరేషన్ కగార్.. వెంటనే నిలిపివేయాలి

  • By: sr    news    Apr 28, 2025 6:51 PM IST
MLC KAVITHA | ఆపరేషన్ కగార్.. వెంటనే నిలిపివేయాలి

MLC KAVITHA |

హైద‌రాబాద్, ఏప్రిల్‌28(విధాత‌): మావోయిస్టుల ఏరివేత‌కు కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న ఆప‌రేష‌న్ క‌గార్ ను వెంట‌నే నిలిపివేయాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్ చేశారు. త‌క్ష‌ణ‌మే మావోయిస్టుల‌ను శాంతి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించాల‌ని కోరారు. సోమ‌వారం నాడు ఆమె త‌న నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య‌యుతంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మని ఇప్ప‌టికే మావోయిస్టులు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కేంద్రం ముందుకు రావాల‌ని అన్నారు.

మావోయిస్ట ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని రాజ‌కీయ పార్టీలతో మాట్లాడి ప్ర‌భుత్వ స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని, కేవ‌లం చ‌ర్చ‌ల ద్వారా మాత్ర‌మే శాంతిని నెల‌కొల్ప‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. కాల్పులతో మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్ర ప్ర‌భుత్వపు విధానం స‌రికాద‌ని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి చర్చలు నిర్వహించాలని అన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేక మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారని, కేసీఆర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల చత్తీస్ ఘడ్ నుంచి వచ్చి కూడా తెలంగాణలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని గుర్తు చేశారు. కేసీఆర్ విధానాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని, స‌రెండ‌ర్ల‌ను ప్రోత్స‌హించి వారికి జీవ‌నోపాధి క‌ల్పించడానికి ప్ర‌భుత్వాలు కృషి చేయాల‌ని అన్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారని, ఎవరు చనిపోయినా కూడా మన దేశ పౌరులే కాబట్టి కేంద్రం చొరువ తీసుకోవాలని తెలిపారు.