YS జగన్‌కు ED షాక్! రూ. 800 కోట్ల ఆస్తులు జప్తు

  • By: sr    news    Apr 18, 2025 5:57 PM IST
YS జగన్‌కు ED షాక్! రూ. 800 కోట్ల ఆస్తులు జప్తు

విధాత: మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఈడీ వరుస షాక్‌లు ఇస్తోంది. క్విడ్ ప్రోకో పెట్టుబడులు, మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన కేసుల్లో ఇప్పుడు ఏకంగా రూ. 800 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన రూ.27.5 కోట్ల విలువైన వాటాలు, దాల్మియా సిమెంట్స్ (భారత్) లిమిటెడ్ యాజమాన్యంలోని రూ.377.2 కోట్ల విలువైన భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ యూనిట్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తి విలువ రూ.793.3 కోట్లు అని డీబీసీఎల్ వెల్లడించింది.

కేసు నమోదు చేసిన 14 సంవత్సరాల తర్వాత ఈ అటాచ్‌మెంట్ జరిగింది. 2009 – 2010 కాలంలో నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో, ఆయన కంపెనీలకు లాభాలు కలిగించారని దానికి బదులుగా వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీలలో ఉన్న వాటాలు (షేర్లు) ఈడీ అటాచ్ చేసినట్టు సమాచారం. ఈ ఆస్తులు జగన్ రెడ్డి వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబం, సంబంధిత కంపెనీలు, సహచరుల పేరిట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులలో సీబీఐ కూడా విచారణ కొనసాగిస్తోంది.

వెంటాడుతున్న కేసులు

పలు అవినీతి కేసులలో జగన్ ఏ1గా ఉన్నారు. ఆయనపై దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి గతంలో చర్లపల్లి జైలులో దాదాపు 16 నెలల పాటు శిక్ష అనుభవించారు. ఇప్పుడు తాజాగా ఆ కేసులకు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. 2009- 2010- 2011 మూడు సంవత్సరాల్లో నమోదైన సీబీఐ కేసులను ఆధారంగా చేసుకుని దాదాపు 12 సంవత్సరాలుగా ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. జగన్ కంపెనీలు, బినామీలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలను సీబీఐ గతంలో మోపింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ కొనసాగించారు. 14 ఏళ్ల తర్వాత రూ.800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

పునీత్ దాల్మియా కంపెనీకి చెందిన రూ.793 కోట్లు జప్తు చేసినట్లు ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. గతంలో కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనులను పునీత్ దాల్మీయా కంపెనీకి కట్టబెట్టడం, వారికి లాభాలు చేకూరడంతో ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని సీబీఐతో పాటు ఈడీ కూడా విచారణలో వెల్లడించింది. భారతీ సిమెంట్స్ క్విడ్ ప్రోకోకు పాల్పడిందంటూ గతంలో సీబీఐ తన చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. ఈడీ అధికారులు కూడా అదే అంశాన్ని స్పష్టం చేశారు. బినామీల పేరుపై ఉన్న ఆస్తులు, క్విడ్‌ ప్రోకు పాల్పడ్డాక లబ్ది పొందిన కంపెనీలకు చెందిన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. 2011లో కేసు నమోదు చేసిన సీబీఐ భారతీ సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టిందని చార్జ్‌షీట్ ఫైల్ చేసింది.