Supreame Court | సీఎం వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యగా పరిగణించాల్సి వస్తుంది.. : రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు సీరియస్‌

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో ఇరువైపు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అయితే 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టును న్యాయవాది ఆర్యమ సుందరం కోరారు. ఇప్పుడు ఈ కేసులో ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

  • By: sr    news    Apr 03, 2025 1:31 PM IST
Supreame Court | సీఎం వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యగా పరిగణించాల్సి వస్తుంది.. : రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు సీరియస్‌

విధాత : ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఉప ఎన్నికలు వచ్చేది లేదంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. సీఎం కొంత సంయమనం పాటించాలని పేర్కొంటూ.. ఇలాంటి వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యగా పరిగణించాల్సి వస్తుందని సీరియస్‌ అయ్యింది. గత అనుభవం ఉన్న వ్యక్తిగా సీఎం కొంత కనీస నియంత్రణ పాటించాలి కదా? అని ప్రశ్నించింది. ‘ఆ సమయంలో మేం సరైన తీర్పు ఇవ్వకుండా తప్పు చేశామా?’ అని సూటిగా ప్రశ్నించింది. ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. పార్టీ ఫిరాయించిన 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కే.పీ. వివేకానంద, బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డిలు వేసిన పిటిషన్లపై గురువారం వాదనలు కొనసాగాయి. అసెంబ్లీ కార్యదర్శి తరుపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. అంతకుముందు , స్పీకర్ తరుపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరుపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం తన వాదనలు వినిపించారు.

స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించలేదు

అసెంబ్లీ కార్యదర్శి తరుపున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించలేదని వాదించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. మణిపూర్‌ వ్యవహారం పూర్తిగా భిన్నమైందని.. ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని తెలిపారు. రాణా కేసు పూర్తిగా ప్రత్యేకమైందని.. ప్రస్తుత అంశానికి సరిపోదని సింఘ్వి పేర్కొన్నారు. అయితే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ రాణా కేసులో జోక్యం చేసుకొని అనర్హత విధించిందని ప్రస్తావించారు.

రీజనబుల్ టైమ్ పై మరోసారి ధర్మాసనం నిలదీత

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కు రిజనబుల్ టైమ్ అంశంపై మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. మీ దృష్టిలో ‘రీజనబుల్‌ టైమ్‌’ అంటే ఏంటని న్యాయవాది సింఘ్విని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రశ్నించారు. మీ అభిప్రాయం ప్రకారం 2028జనవరి ఫిబ్రవరి వరకు ఎదురుచూసేలా వ్యవస్థను మార్చేందుకు అనుమతించాలా.. ? మేం కొంత న్యాయసమ్మతమైన ధోరణిని ఆశిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదుల తీరు పూర్తిగా మారిపోతుందని జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. అనర్హత పిటిఫన్లపై మీకు ఎంత సమయం కావాలని ప్రశ్నించగా..ఆరునెలల సమయం కావాలని న్యాయవాది సింఘ్వి కోరారు. దీంతో జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 11నెలల సమయం వృధా అయ్యిందని, మరో ఆరు నెలలు ఎలా అడుతుతారని..ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా అని ప్రశ్నించారు. అయితే స్పీకర్ కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారని లాయర్ సింఘ్వి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలను మరోసారి ధర్మాసనం ఎదుట పాడి కౌశిక్‌రెడ్డి తరపు న్యాయవాది అర్యమ సుందరం ప్రస్తావించారు.

సీఎం వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం

ఉప ఎన్నికలు రావు..స్పీకర్ తరుపున కూడా చెబుతున్నా అంటూ సీఎం అసెంబ్లీలో వ్యాఖ్యానించారని..అలాగైతే పిటిషన్లపై విచారణను మేం ఎలా నమ్మాలని న్యాయవాది అర్యమ సుందరం కోర్టు దృష్టికి నివేదించారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచైనా రక్షణ ఉంటుందని అన్నారని సుందరం పేర్కొన్నారు. స్పందించిన జస్టీస్ గవాయ్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం సీఎం స్వీయ నియంత్రణ పాటించలేరా?.. గతంలో ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా మళ్లీ ఇలాగే వ్యవహరిస్తే ఎలా? అని అంటూ సింఘ్విని జస్టిస్‌ గవాయ్‌ ప్రశ్నించారు. ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని సింఘ్వి తెలుపగా.. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం పక్కనపెట్టింది. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కిందకు తీసుకోవాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. తాము సంయమనం పాటిస్తున్నామని.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాతా కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది సింఘ్వీ పేర్కొనగా.. సింగిల్‌ జడ్జి సూచనలు పాటిస్తే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన తర్వాతే నోటీసులు ఇచ్చారని జస్టిస్‌ గవాయ్‌ గుర్తు చేశారు. ఈ క్రమంలో మణిపూర్ వ్యవహారం, రాణా కేసుతో పాటు మరికొన్ని అంశాలను అభిషేక్ సింఘ్వి కోర్టుకు వివరిస్తూ వాదనలు ముగించారు.

సుప్రీంకు అన్ని అధికారాలు ఉంటాయి..

అభిషేక్ మను సింఘ్వి వాదనలు ముగియడంతో.. పిటీషనర్ల తరపున కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి చివరి వాదనలు వినిపించారు. మహారాష్ట్ర వ్యవహారం సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందన్నారు. స్పీకర్‌కు తగిన ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయన్నారు. సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ తప్పక తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పేర్కొందని న్యాయవాది ఆర్యామ సుందరం అన్నారు.

తీర్పు రిజర్వు..

జనవరిలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించాక స్పీకర్ నోటీసులు ఇచ్చారని, మూడు వారాలు సమయం ఇచ్చారని, ఆ మూడు వారాల సమయం కూడా పూర్తి అయిందని న్యాయవాది ఆర్యామ సుందరం వివరించారు. నోటీసులు పంపిన సమాచారం కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వలేదని న్యాయవాది పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రస్తావించారు. దీనిపై న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం చెప్పారు. ధర్మాసనం కూడా తాము ఆ విషయంలోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో ముగిసింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అయితే 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టును న్యాయవాది ఆర్యమ సుందరం కోరారు. ఇప్పుడు ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠత రేపుతోంది. స్పీకర్ కు నిర్థిష్టమైన సమయంలో నిర్ణయం తీసుకోమని ఆదేశిస్తుందా లేక..అనర్హత వేటుపై నిర్ణయం ప్రకటిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.