Tamilnadu
విధాత: నాగరిక సమాజంలోనూ అనాగరికంగా ప్రవర్తించాడు ఓ ట్రాఫిక్ ఎస్ఐ. నడిరోడ్డుపై ఓ హిజ్రాతో పూజలు చేయించాడు. గుమ్మడికాయను కొట్టించి, ఆ తర్వాత నిమ్మకాయలతో దిష్టి తీయించాడు. మరి ఇదంతా ఎందుకు చేయించాడో తెలుసా..? అంటే.. ఆ రోడ్డుపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరగడమే. మూఢనమ్మకంగా గుమ్మడి కాయ, నిమ్మకాయలతో దిష్టి తీయిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆ ట్రాఫిక్ ఎస్ఐ భావించినట్లు విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన పళని.. చెన్నై ట్రాఫిక్ పోలీసు విభాగంలో స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SSI)గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వనగారం, మదువోయల్ రోడ్డు మార్గాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మూఢనమ్మకంగా ఓ చర్యకు పాల్పడ్డాడు.
హిజ్రాను పిలిపించి.. ఆమె చేత నడిరోడ్డుపై గుమ్మడికాయను కొట్టించి, నిమ్మకాయలతో దిష్టి తీయించాడు. అనంతరం ఆ హిజ్రాను ట్రాఫిక్ పోలీసు వాహనంలోనే ఎక్కించి పంపించేశాడు ట్రాఫిక్ ఎస్ఐ. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకోగా, అక్కడున్న కొంత మంది తమ మొబైల్స్‌లో చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.
హిజ్రాతో దిష్టి తీయించడంతో.. పళనిని ట్రాఫిక్ పోలీసు విధుల నుంచి ఉన్నతాధికారులు తొలగించారు. కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేశారు. ఈ ఘటనపై ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ కపిల్ కుమార్ షరత్కర్ స్పందించారు.
ఈ చర్య పూర్తిగా అతని వ్యక్తిగత నమ్మకం అని పేర్కొన్నారు. అయితే వృత్తిపరంగా ఈ చర్య సరికాదన్నారు. రోడ్డు ప్రమాదాలను శాస్త్రీయంగా నివారించాలి తప్ప.. ఇలాంటి మూఢనమ్మకాలకు పాల్పడొద్దని కపిల్ కుమార్ సూచించారు.