TGPSC Group 1 Re-evaluation | గ్రూప్-1 మెయిన్స్ పేపర్ రీవాల్యూయేషన్: హైకోర్టు డివిజన్ బెంచ్ లో టీజీపీఎస్‌సీ సవాల్
గ్రూప్-1 మెయిన్స్ పేపర్ రీవాల్యూయేషన్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్‌సీ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.

గ్రూప్ -1 అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం సవాల్ చేసింది. గ్రూప్- 1 మెయిన్స్ ర్యాంకులను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఈ నెల 9న తీర్పును వెలువరించింది.అంతేకాదు పేపర్ రీ వాల్యూయేషన్ చేయాలని కూడా ఆదేశాలిచ్చింది. ఒకవేళ పేపర్ రీ వాల్యూయేషన్ చేయకపోతే గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించి 563 పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది. పేపర్ రీ వాల్యూయేషన్ చేయడం వల్ల ఇబ్బందికర పరిణామాలు ఎదురౌతాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభిప్రాయపడింది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్చించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేయాలనే పబ్లిక్ సర్వీస్ ప్రతిపాదనపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 10న ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 30న జనరల్ ర్యాంకులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ విషయంలో కూడా అభ్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. పేపర్ వాల్యూయేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులకే ర్యాంకులు వచ్చాయని కూడాఆరోపించారు. ఈ విషయమై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 9 తీర్పును వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఆ సమయంలో ఎన్నికలు రావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 60 పోస్టులను కలిపి 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను క్యాన్సిల్ చేశారు.