I&PR Telangana | తెలంగాణ ఐఅండ్‌పీ ఆర్ డైరెక్టర్ కిశోర్‌పై తిరుగుబాటు!

- ఆయన అక్రమ పదోన్నతిని రద్ధు చేయాలి
- విజిలెన్స్, ఏసీబీతో విచారణ చేయాలి
- తెలంగాణ జన పరిషత్, దళిత బహుజన పోరాట సమితి డిమాండ్
- సీఎం, ఐఅండ్ పీఆర్ మంత్రికి ఫిర్యాదులు
హైదరాబాద్, మే 17 (విధాత)
I&PR Telangana | ప్రత్యేక తెలంగాణ వచ్చినా ఆంధ్రా ప్రాంత అధికారుల జోరు ఆగడం లేదు. తెలంగాణ ప్రాంత అధికారులను తొక్కి, ఆంధ్రా అధికారులకు పదోన్నతులు ఇచ్చి సకల మర్యాదలు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేసింది ఇందుకోసమేనా? అని సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) ఉద్యోగులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆంధ్రా పెత్తనం కొనసాగిందని, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ నడుస్తోందని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. సమాచార, పౌర సంబంధాల డైరెక్టర్‌గా ఎల్‌ఎల్‌ఆర్ కిశోర్ బాబును తొలగించి, తెలంగాణ వాసికి ఆ బాధ్యత ఇవ్వాలని తెలంగాణ జన పరిషత్, దళిత బహుజన పోరాట సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
జర్నలిజం ఓనమాలు తెలియని అధికారికి బాధ్యతలా?
జర్నలిజం, పౌర సంబంధాలలో ఓనమాలు తెలియని ఇన్‌ఫర్మేషన్ ఇంజినీర్ ఎల్‌ఎల్‌ఆర్ కిశోర్ బాబుకు సమాచార, పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్‌గా పనిచేసిన ఎం హన్మంతరావు పదోన్నతి ఇచ్చారు. ఈ పదోన్నతి రద్దు చేయాలని, తిరిగి ఇంజినీరింగ్ విభాగానికి కిశోర్‌ను బదిలీ చేయాలని తెలంగాణ జన పరిషత్, దళిత బహుజన పోరాట సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన కిశోర్ బాబును తెలంగాణకు కేటాయించారు. తెలంగాణలో మంజూరు లేని ఇన్‌ఫర్మేషన్ ఇంజినీరు పోస్టులో అక్రమంగా కొనసాగుతున్నారని. హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులకు వ్యతిరేకంగా, ఇన్‌ఫర్మేషన్ సర్వీసు రూల్స్ సవరించకుండా ఐ అండ్ పీఆర్ I and prలో అడిషనల్ డైరెక్టర్ పదోన్నతి కల్పించారని వారు అంటున్నారు. ఇన్‌ఫర్మేషన్ ఇంజినీరుగా, టీజీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుమారు రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సీనియర్‌ను పక్కనపెట్టి..
తెలంగాణ ప్రాంతవాసి అయిన నాగయ్య కన్నా సీనియర్ అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రకటించారని, ఇన్‌ఫర్మేషన్ డిపార్ట్ మెంట్ సర్వీసు రూల్స్ సవరించకుండా తన విభాగంతో సంబంధం లేని ఐ అండ్ పీఆర్ లో కిశోర్ కు డైరెక్టర్ గా అప్పటి స్పెషల్ కమిషనర్ హన్మంతరావు పదోన్నతి ఇచ్చారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఇంజినీర్‌కు ఐఅండ్ పీఆర్ లో అడిషనల్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించలేదని తెలిపారు. హన్మంతరావు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కోసం బలిదానం చేసిన 1500 అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కిశోర్‌తోపాటు డిప్యూటీ డైరెక్టర్ వెంకట సురేశ్ కోసమే ప్రత్యేక తెలంగాణ వచ్చినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఐ అండ్ పీఆర్ కమిషనర్ అయిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌కు బినామీగా వెంకట సురేశ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అక్రమ పదోన్నతి ఇచ్చేందుకు 11 నెలల క్రితం అప్పటి స్పెషల్ కమిషనర్ జీవో ఇవ్వడమే కాకుండా, రాటిఫై చేయాల్సిందిగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారని తెలిపారు. ఆ ఫైలును ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఆమోదించనందున, వెంటనే పదోన్నతిని రివర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పదోన్నతి కల్పించిన తరువాత టీజీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌నుంచి రిలీవ్ అయినట్లు ఉత్తర్వులు ఇచ్చి, ఆ తరువాత మూడు నెలల పాటు జీతం చెల్లించారని తెలిపారు. చట్టపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో ఆయనకు మూడు నెలల పాటు చెల్లించిన జీతాన్ని తిరిగి టీజీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జమ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు నిలదీస్తారనే ఉద్దేశంతో ఆయనను మాసబ్ ట్యాంక్ లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయంలో కాకుండా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సచివాలయంలో పనిచేయిస్తున్నారని తెలిపారు.
నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం
సచివాలయంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు ఎక్స్ అఫిషియో సెక్రటరీగా చాంబర్ ఉందని, ఒక వేళ ఆయనకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా విధులు అప్పగించినట్లయితే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. బీసీ కులానికి చెందిన ఆయన నకిలీ ఎస్సీ కులం సర్టిఫికెట్‌తో ఉద్యోగానికి ఎంపికయ్యారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నకిలీ ఎస్సీ సర్టిఫికెట్‌పై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనల ప్రకారం అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నుంచి డైరెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి మీడియాకు పంపించే ప్రెస్ నోట్ రాయడం రావాలని, జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేసి ఉండాలని, అంతేకాకుండా జర్నలిజంలో డిగ్రీ పట్టా తీసుకుని ఉండాలని గుర్తు చేశారు. ఈ మూడింటిలో ఏ ఒక్క అర్హత కూడా ఆయనకు లేదని తెలిపారు. ఇన్ని నిబంధనలు ఉన్నా వాటిని బేఖాతర్ చేస్తూ, ఉన్నతాధికారులు డబ్బులు తీసుకుని పదోన్నతులు ఇచ్చారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ నివేదికలు ఉన్నా పట్టించుకోకుండా వరుసగా పదోన్నతులు ఇచ్చారు. 2017-18 సంవత్సరంలో ఈయన రూ.16 కోట్లతో కొనుగోలు చేసిన నకిలీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కనీసం పదిరోజులు కూడా పనిచేయాలని సమాచార, పౌర సంబంధాల ఉద్యోగులు అప్పటి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫారసు చేస్తే కమిషనర్ బుట్ట దాఖలు చేశారని, ఈ ఆరోపణలపై తెలంగాణ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు అవినీతి నిరోధక శాఖ తో కిశోర్ బాబు పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన పరిషత్, దళిత బహుజన పోరాట సమితి తమ ఫిర్యాదులో డిమాండ్ చేశాయి.