IAS Transfers  | భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. చక్రం తిప్పింది ఎవరు?

  • By: TAAZ    news    Jun 13, 2025 1:30 AM IST
IAS Transfers  | భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. చక్రం తిప్పింది ఎవరు?

IAS Transfers  | తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బదిలీల్లో మాజీ ఐఏఎస్ అధికారి, ఏఐసీసీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు తెలంగాణ ప్రభుత్వంలో తన హవా నడిపిస్తున్నారన్న విమర్శలు కొద్ది నెలలుగా విన్పిస్తున్నాయి. మంత్రి పదవుల ఎంపిక మొదలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నియామకం వరకు ఆయన సిఫారసులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. తాజా ఐఏఎస్ బదిలీల్లో ఆయన వర్గంగా ముద్రపడిన దాసరి హరిచందన, రాజీవ్ గాంధీ హన్మంతు, డీఎస్ లోకేశ్‌ కుమార్, నవీన్ నికోలస్‌కు పెద్దపీట వేశారని సచివాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షిస్తున్న రెవెన్యూ శాఖ కార్యదర్శిగా, సీసీఎల్‌ఏగా డీఎస్ లోకేశ్‌ కుమార్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఈయన నియామకం వల్ల ఢిల్లీలోని మాజీ ఐఏఎస్‌తోపాటు ఇక్కడున్న ప్రభుత్వంలోని ముఖ్య నాయకుడికి భూముల లావాదేవీల సమాచారం ఎప్పటికప్పుడు వెళ్తుందని సీనియర్ అధికారుల్లో చర్చ జరుగుతున్నది. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల బదలాయింపు, భూ మార్పిడిపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు బదిలీ చేశారు. ప్రజలు, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గక తప్పలేదంటున్నారు. ఆయన స్థానంలో ఎన్నికల కమిషన్‌లో పనిచేస్తున్న డిప్యుటీ సీఈవో డీఎస్ లోకేశ్‌ కుమార్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. మిట్టల్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యవేక్షిస్తున్న ఇంధన శాఖకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు. సింగరేణి కాలరీస్ సీఎండీగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ఎస్సీ డెవలప్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రాధాన్యం లేని శాఖను కేటాయించారు. తాజా బదిలీల్లో ఆయనను పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను అక్కడి నుంచి తప్పించి ఎస్సీ డెవలప్‌మెంట్‌ శాఖ కార్యదర్శిగా నియమించారు. గత కొద్ది నెలలుగా ఈ విభాగంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వ పెద్దలు ఎస్సీ డెవలప్‌మెంట్‌కు మార్చారంటున్నారు. బుద్ధ ప్రకాశ్ స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును నియమించారు. ముక్కుసూటిగా, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రును బదిలీ చేసి ఆయన స్థానంలో మిక్కిలినేని మను చౌదరిని నియమించారు. సీడీఎంఏ లో అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జే.శంకరయ్య ను టీజీ ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా, ఆయుష్ సంచాలకులుగా (ఎఫ్ఏసీ) ప్రొఫెసర్ పీ.శ్రీకాంత్ బాబును, టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పవన్ కుమార్ ను, ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా గుర్రం మల్సూర్ ను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. మల్సూర్ ఇప్పటి వరకు పరిశ్రమల సంచాలకులుగా పనిచేశారు.

బదిలీ అయిన అయిన అధికారుల వివరాలు