King Cobra: 14వేల పాములు పట్టాడు.. చివరకు రాచ‌నాగు కాటుతో ఐసీయూలో

  • By: sr    news    Jun 29, 2025 10:54 PM IST
King Cobra: 14వేల పాములు పట్టాడు.. చివరకు రాచ‌నాగు కాటుతో ఐసీయూలో

King Cobra | Tirumala

విధాత: భాస్కర నాయుడు.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో తరుచు వినిపించేది.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగిగా భక్తులను పాముల నుంచి రక్షించే క్రమంలో ఆయన 14వేల పాములను పట్టుకున్న గొప్ప స్నేక్ క్యాచర్. పాములను పట్టే క్రమంలో పలుమార్లు వాటి కాటుకు గురైన ఎప్పుడూ ప్రాణాపాయం వరకు వెళ్లలేదు. అయితే ఈసారి ఓ నాగుపాము కాటుకు గురై పాము కాటు విషం శక్తి ఏమిటో రుచి చూశాడు. చావు అంచుల దాకా వెళ్లి శ్రీవారి కరుణ అనుకుంటు బతికి బట్టకట్టాడు.

భాస్కర నాయుడు గోగర్బం డ్యాం సమీపంలోని గార్డెన్‌లో శనివారం నాగుపామును పట్టుకుని బ్యాగులో వేస్తుండగా అతడి ఎడమచేతిపై కాటేసింది. పాము కాటుతో రెండు నిమిషాల్లోనే భాస్కర నాయుడు కుప్పకూలి పోగా తోటి సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పాము విషానికి విరుగుడిగా ఇచ్చే మెడిసన్‌ (యాంటీ వీనం) ఇచ్చారు. అయినప్పటికి పరిస్థితి విషమంగానే ఉండటంతో వెంటిలేటర్‌పై తిరుపతిలోని అమర ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

1982లో టీటీడీ అటవీశాఖలో కార్మికుడిగా చేరిన భాస్కర నాయుడి నైపుణ్యం గుర్తించి పాములు పట్టేందుకు ఆయనకు ప్రత్యేక విధులు కేటాయించారు. 2021లో రిటైరైనప్పటికీ కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 14 వేలకు పైగా పాములు పట్టారు.

2022 జనవరిలో ఒకసారి తిరుపతిలో విషపూరితమైన పాము కాటేయడంలో నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని మళ్లీ విధుల్లోకి చేరారు. ఈ దఫా మరోసారి అంతకంటే శక్తివంతమైన విషపూరిత పాము కాటు వేయడంతో భాస్కర నాయుడు మరోసారి ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. పాముల బారి నుంచి తమను రక్షించే భాస్కర నాయుడు కోలుకుంటున్న వార్తతో తిరుమల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.