Telangana: అడవుల్లో శాంతి నెలకొనేనా! చర్చల కమిటీ ప్రయత్నం ఫలించేనా?

మావోయిస్టులపై మారణకాండ..
ఆగాలని కోరుతున్న తెలంగాణ
బీజేపీ మినహా పార్టీలన్నీ ఏకం
నక్సల్స్‌తో చర్చించాలన్న కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విధాత): తెలంగాణలో బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలన్నీ మావోయిస్టులపై కాల్పులు విరమించి, శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నాయి. గత కొద్ది నెలలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల నిర్మూలనకు దిగింది. దీంతో తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు ఎరుపెక్కాయి. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాల్లో విస్తరించిన కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్లి మావోయిస్టులను ఏరివేస్తున్నాయి.
కర్రెగుట్టలను జల్లెడపడుతున్న బలగాల కాల్పుల మోత, ఐఈడీ శబ్ధాలతో పరిసర గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఈ భయానక వాతావరణాన్ని నిలువరించాలని ప్రజాస్వామ్యవాదులు, వామపక్షవాదులు, మేధావులు కోరుకుంటున్నారు. వారితో శాంతి చర్చలు జరిపాలని పాలక పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేస్తే తప్ప ప్రశాంత వాతావరణం నెలకొనే పరిస్థితి లేదని వారు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, సీపీఐ, వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ విషయంలో బీజేపీ మినహా అన్ని పార్టీలు సముఖంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు జూబ్లీహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదు అని రేవంత్ రెడ్డి వారితో అన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో తక్షణమే ఎన్‌కౌంటర్లు ఆపాలని సీపీఐ శాసనసభా పక్షం నేత కూనమనేని సాంబశివరావు కూడా డిమాండ్ చేశారు. యావత్ తెలంగాణ సమాజం కూడా మావోయిస్టులపై మారణకాండ ఆగాలని కోరుకుంటున్నాయి.
మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదివారం సాయంత్రం శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశం అయ్యారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ని వారు కోరారు. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదని రేవంత్ రెడ్డి అన్నారు.
గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం కాంగ్రెస్ సీనియర్ నేత కే.జానారెడ్డి కి ఉందని గుర్తు చేశారు. ఈ అంశంపై జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తెలియచేస్తామని శాంతి చర్చల కమిటీ నేతలకు స్పష్టం చేశారు. శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.