PLASTIC POLLUTION | డిష్‌వాషర్లతో పర్యావరణానికి ఇంత డేంజరా? వాటినుంచి వెలువడే ప్లాస్టిక్ పార్టికల్స్ ఎన్నో తెలుసా?

PLASTIC POLLUTION |ప్లాస్టిక్ పొల్యూషన్ అనగానే మనకు రోడ్డు మూలపై చెత్తకుప్పలో కనిపించే ప్లాస్టిక్ కవర్లు, సముద్ర తీరాల్లో పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలే గుర్తుకొస్తాయి. చాలా కొద్ది మందే తమ ఇళ్లలో వెలువడే ప్లాస్టిక్ వ్యర్థాల గురించి ఆలోచిస్తున్నారు. అందులోనూ ఆధునిక కిచెన్‌లలో సాధారణ ప్లాస్టిక్ బాక్సుల నుంచి వెలువడే అత్యంత ప్రమాదకరమైన మైక్రోప్టాస్టిక్ మన పర్యావరణాన్ని ఊహించలేని విధంగా దెబ్బతీస్తున్నదనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా?
ఇళ్లలో ప్రత్యేకించి ఇళ్లలో వాడే డిష్‌వాషర్ల నుంచి వెలువడే మైక్రో ప్లాస్టిక్ విషయంలో యూనివర్సిటీ ఆఫ్ క్వీన్‌ల్యాండ్ ఒక అధ్యయనం నిర్వహించింది. అందులో తేలిన విషయాలు పర్యావరణానికి డిష్‌వాషర్లు ఎంత హాని చేస్తున్నాయో వెల్లడైంది. మన ఇంట్లో అలవాట్లు గ్లోబల్ పొల్యూషన్‌కు ఎలా దారి తీస్తున్నాయనే విషయంలో, మనం బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరుపై కొత్త చర్చకు ఈ అధ్యయనం దారి తీసింది. ప్లాస్టిక్ వాడకం, ఇంట్లో అంట్లు తోమే అలవాట్లు, వృథాగా పోయే నీరు కలుషితం కావడం మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనం చర్చనీయాంశం చేసింది. ఇంతకాలం డిష్‌వాషర్లు పర్యావరణానికి చేసే హాని ఏముంటుదిలే అన్న ఉదాశీనత ఉండేది. అయితే.. ఇప్పుడు కొత్తగా తెలుస్తున్న అంశాలు అందులో వాస్తవ పరిస్థితిని ఆందోళనకర స్థాయిలో కళ్లకు కడుతున్నాయి.
క్వీన్స్‌ల్యాండ్ అలయెన్స్ ఫర్ ఎన్వైర్‌మెంటల్ హెల్త్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ ఎల్విస్ ఒకోఫో నేతృత్వంలోని బృందం డిష్‌వాషర్ల నుంచి వెలువడే మైక్రోప్లాస్టిక్‌పై అధ్యయనం నిర్వహించింది. నిర్దిష్ట డిష్‌వాషింగ్ పరిస్థితుల్లో లోపల ఉంచిన ప్లాస్టిక్ కంటెయినర్లు ఎలా ఉంటాయన్న విషయంలో ఈ అధ్యయనం సాగింది. ‘ప్లాస్టిక్ కంటెయినర్లు, పాత్రలు డిష్‌వాషర్లలో కడిగినప్పుడు ప్లాస్టిక్ పార్టికల్స్‌ను విడుదల చేసినట్టు గుర్తించాం’ అని డాక్టర్ ఒకోఫో చెప్పారు. ‘ఇదేదో ఊహించి చెబుతున్నది కాదు. సాధారణ ఇంటి నుంచి ఒక విడుతలో డిష్‌వాషర్‌లో పెడుతున్న ప్లాస్టిక్ కంటెయినర్లు పరిశలించిన పరిశోధకులు.. అనంతరం ఆ డిష్‌వాషర్ నుంచి వెలువడిన వృథా నీటిని ట్రాక్ చేశారు. సాధారణంగా ఇంట్లో పాత్రలను కడిగిన తీరుకంటే మించిన దుష్ప్రభావాలు మెకానికల్ డిష్‌వాషింగ్‌లో కలుగుతాయని గుర్తించారు. అధిక వేడి, నీటి ఒత్తిడి, శుభ్రం చేసే రసాయనాలకు ప్లాస్టిక్ వస్తువులు ప్రభావితం అవుతాయి’ అని ఆయన వివరించారు. అంతిమంగా ఈ మైక్రోప్లాస్టిక్ కలగలిసిన వృథా నీరు మురుగు కాల్వల్లోకి, అనంతరం నదులు, సముద్రాల్లోకి వెళ్లిపోతున్నది. ఆశ్చర్యకరంగా మన వంటిళ్లు సైతం పర్యావరణానికి తీవ్ర హాని కలుగజేస్తున్నాయి. ఇది అంతిమంగా మానవ ఆరోగ్యంపైనే తిరిగి దుష్ప్రభావాలకు కారణమవుతున్నదని డాక్టర్ ఒకోఫో చెప్పారు.
డిష్‌వాషర్లు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ వేడి నీటిని ఉపయోగిస్తాయి. ఈ వేడిలో ప్లాస్టిక్ కంటెయినర్ భౌతికంగానే కాకుండా.. రసాయనికంగా కూడా రియాక్ట్ అవుతుంది. అందులోనూ నీటిని వాటర్‌జెట్స్, డిటర్జెంట్లతో ఒత్తిడికి గురి చేసి క్లీన్ చేస్తాయి. వీటిని పదేపదే ఇలా క్లీన్ చేయడం ద్వారా ప్లాస్టిక్ దుర్బలంగా మారిపోతూ దాని నుంచి భారీ స్థాయిలో పార్టికల్స్ విడుదలై.. మురుగు కాల్వల్లోకి ప్రవేశిస్తాయి. ఒక డిష్‌వాషర్ ఒక సారి ఉపయోగించిన తర్వాత 9,20,000 ప్లాస్టిక్ పార్టికిల్స్ విడుదలవుతాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. వీటిలో మైక్రో ప్టాస్టిక్స్ కూడా ఉంటాయి. అయితే.. ఈ సంఖ్య పెద్దిగా కనిపిస్తున్నా.. ఇతర మార్గాల ద్వారా పర్యావరణలో కలిసే మైక్రోప్లాస్టిక్, ప్లాస్టిక్ పార్టికిల్స్‌తో పోల్చితే చాలా స్వల్పమేనని డాక్టర్ ఒకోఫో చెప్పారు.
ఈ ప్రమాదాన్ని నివారించలేమా?
ఇప్పటికే ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ కారకాల్లో ఒక కీలకమైనదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఆహార పదార్థాలను, ప్రత్యేకించి వేడిగా ఉండేవాటిని ప్లాస్టిక్ కవర్లు, బాక్సుల్లో పెట్టవద్దని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత మేరకు స్టీల్ పాత్రలు, కంటెయినర్లు ఉపయోగించడం ద్వారా ఈ మైక్రోప్లాస్టిక్ భూతాన్ని వంటింటి స్థాయిలో నిలువరించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే రోడ్డు పక్కన చెత్తకుప్పలో పడిన ప్లాస్టిక్ కవర్‌ను తీసేయొచ్చగానీ.. నీటిలో కలిసిపోయే నానా ప్లాస్టిక్‌ను తొలగించడం చాలా సంక్లిష్టమైనది. నానో, మైక్రోప్లాస్టిక్ తక్షణం సముద్ర జీవులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మనం తినే చేపల వంటివాటిల్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక.. మనం తీసుకునే చిన్న జాగ్రత్తలు మన భావి తరాల ఆరోగ్యానికి ఒక పెద్ద ముందడుగు అవుతుందని అంటున్నారు. ఈ అధ్యయనం ఏసీఎస్ ఈఎస్‌అండ్‌టీ వాటర్ జర్నల్‌లో ప్రచురితమైంది.