Polluting Industries | కాలుష్యం నిజం… రాజకీయం తథ్యం.. పీసీబీ చర్యలు మిథ్య!
కాలుష్య నివారణకు చట్టాలు ఉన్నా.. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలకు స్థానిక రాజకీయ నాయకుల అందడండలు ఉండటంతో వాటిని పీసీబీ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారన్న చర్చలు తెలంగాణ మేధావి వర్గంలో వినిపిస్తున్నాయి.

హైదరాబాద్, అక్టోబర్ 18 (విధాత ప్రతినిధి):
Polluting Industries | చట్టాలెన్ని ఉన్నా, ప్రభుత్వ వ్యవస్థలు ఎన్ని పనిచేసినా కాలుష్యకారక పరిశ్రమల ఆగడాలకు అడ్డు పడటం లేదు. సహజ వనరులను యథేచ్ఛగా తవ్వేస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, పంట భూములు నాశనమవుతున్నాయని, గాలి కాలుష్యంతో అల్లాడుతున్నామని ప్రజలు నెత్తీనోరూ బాదుకుంటున్నా.. సంబంధిత అధికారులు నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. అలాంటి కాలుష్య పరిశ్రమలకు స్థానిక రాజకీయ నాయకుడే అండదండలందిస్తున్నాడన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ వ్యవస్థలు చర్యలు తీసుకునే సాహసం సంగతి పక్కన పెట్టి.. కంపెనీ యజమానులు ఇచ్చే ఆమ్యామ్యాలు జేబులో వేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నామమాత్రమని, నడిపించేది మొత్తం స్థానిక నాయకులేనని ఒక ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, రసాయన పరిశ్రమలు లెక్కకు మించి ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ భూగర్భ జలాలను వినియోగించలేని దుస్థితి ఎదురవుతున్నది. సూరారం, పటాన్ చెరు వంటి పారిశ్రామికవాడల్లో తిరిగితే.. కాలుష్యం తీవ్రత ఎంత భయంకరంగా ఉందో సుస్పష్టమవుతుంది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) తొలగింపుతో కాలుష్య కారక కంపెనీల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బల్క్ డ్రగ్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, సిమెంట్ కంపెనీలు ఒకప్పుడు దిన దిన గండంగా నడిచేవి. ఇప్పుడు అవి రాష్ట్ర రాజకీయ నాయకులను శాసించే స్థాయికి ఎదిగాయన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఇటీవల అరబిందో ఫార్మా కంపెనీపై జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హానికర వ్యర్థ జలాలను సమీపంలోని చెరువులు, కుంటల్లోకి వదిలేస్తున్నారని, శుద్ధి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ పీసీబీ) అధికారులు చర్యలు తీసుకోకపోతే, తానే స్వయంగా వెళ్లి కంపెనీని తగులబెడ్తానని హెచ్చరించారు. ఎమ్మెల్యే హెచ్చరికతో మహబూబ్ నగర్ జిల్లా పీసీబీ అధికారులు మరుసటి రోజు కంపెనీకి వెళ్లి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కానీ ఇంత వరకు నమూనాలో వెల్లడైన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. లోపల ఏమైనా ఒప్పందలు జరిగాయా? ఆమ్యామ్యాలు ఏమైనా ముట్ట చెప్పారా? అనేది తెలియడం లేదని స్థానిక ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు.
మరో జిల్లాలో కూడా లెక్కలేనన్ని సిమెంట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఒక ఫార్మా కంపెనీ వేల కోట్ల రూపాయల విలువైన ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఆ కంపెనీ ప్రాంగణంలోకి వెళ్లడానికి పీసీబీ అధికారులే వణికిపోతారని స్థానికులు చెబుతున్నారు. తనిఖీలకు వస్తున్నట్టు సమాచారం అందిన వెంటనే కంపెనీ యాజమాన్యం వెంటనే పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తుందని, వెంటనే పై స్థాయి అధికారి ఫోన్ చేసి, వెళ్లాల్సిన అవసరం లేదంటూ హూంకరిస్తారని చర్చించుకుంటున్నారు. సిమెంట్ కంపెనీలు నదీ జలాలను కలుషితం చేస్తున్నా చోద్యం చూడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని పీసీబీ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వీళ్లందరూ స్థానిక నాయకుడి చేతిలో ఉంటారని, ఏ ఒక్క ప్రభుత్వ అధికారిని లోనికి రానివ్వరని స్థానికులు అంటున్నారు. ఒకవేళ అడుగు పెడితే కొద్దిరోజుల్లోనే అక్కడి నుంచి బదిలీ అయిపోతారని లేదంటే ఏసీబీ అధికారులకు చిక్కుతారని అంటున్నారు.
స్థానిక నాయకుడి ప్రోద్భలం, అండదండలతోనే కంపెనీలు నడుస్తున్నాయని, వారికి కావాల్సిన వాటిని ఎప్పటికప్పుడు సమకూర్చుతారని సమాచారం. కొన్ని కంపెనీల్లో స్లీపింగ్ పార్టనర్‌గా కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల సమయంలో నిధులు మొత్తం సమకూర్చుతారని, ఆయన జేబులో నుంచి ఒక్క పైసా తీయకుండా చూసుకుంటారని అంటున్నారు. ఇంట్లో జరిగే ఫంక్షన్లు, కార్యాలు, విదేశీ పర్యటనలకు కూడా మొత్తం ఖర్చు ఈ కంపెనీ యాజమాన్యాలు భరిస్తాయని చెప్పుకొంటున్నారు. ఎవరైనా గెస్టులు వస్తే తమ గెస్టు హౌసులలో విందులు కూడా ఏర్పాటు చేసే బాధ్యతలు తీసుకుంటాయని తెలుస్తున్నది. ఈ స్థాయిలో సపర్యలు చేసిన తరువాత స్థానిక నాయకుడు ఆ కంపెనీ వైపు ప్రభుత్వ అధికారులు కన్నెత్తి చూడకుండా తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నారని సమాచారం. కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్స్‌ను కూడా కొందరు జిల్లా కలెక్టర్లు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ ఇంటి గృహోపకరణాలు, ఫర్నీచర్ కోసం వినియోగిస్తున్నారని తెలుస్తున్నది. ఉన్నత లక్ష్యం కోసం ప్రారంభించిన సీఎస్ఆర్ అధికారుల చేత చిక్కి.. తన లక్ష్యాన్ని కోల్పోతున్నదని చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు శిబిరంలో ప్రకంపనలు..పార్టీని కుదిపేస్తున్న లొంగుబాట్లు
NDTV World Summit | “నా విడాకులు, అనారోగ్యం.. అన్నీ ట్రోలింగ్‌లో భాగాలే : సమంత
Elephant calf Video | అడవిలో అమ్మతనపు గొప్పతనం – వైరల్ వీడియో