‘ప్రచార’ దాడులు!

- ప్రచారంలో కోల్పోతున్న సహనం
- ఏది చేసైనా గెలవాలనే తపనే
- వివాదాలను రెచ్చగొట్టే యత్నాలు
- సున్నితంగా మారుతున్న అంశాలు
- అవి ఓట్లు తెచ్చిపెడుతాయని ఆశ
- సరైన ధోరణి కాదన్న విశ్లేషకులు
విధాత, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేతలు సహనం కోల్పోతున్నారు. ఏమి చేసైనా సరే గెలువాలన్న తలంపుతో నేతలు తల పడుతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం విమర్శలే కాదు.. దాడులు, ప్రతి దాడులకు దిగుతున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల ప్రచారంలోనే దాడులకు తెగబడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితా రెడ్డి భర్త, నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డిపై బీఆరెస్ కార్యకర్తలు చేయడం పరాకాష్ట. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెమ్మికల్ వెళ్లిన శ్రీధర్‌రెడ్డి.. ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ తాను స్వయంగా కుర్చీ వేసుకొని కూర్చొని ఏడాదిన్నరలో లిఫ్ట్ పూర్తి చేస్తానని మాట ఇచ్చారని, మూడేళ్లు అవుతున్నా సీఎంకు ఇక్కడ కూర్చోవడానికి కుర్చొ దొరకలేదా? అని అడిగారు.
తాను కుర్చీ ఇస్తున్నాను.. వచ్చి కూర్చొని లిఫ్ట్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బీఆరెస్ కార్యకర్తలు శ్రీధర్‌రెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కింద పడేసి తొక్కినట్లు వీడియోలు కూడా వచ్చాయి. అక్కడి స్థానిక ప్రజలు శ్రీధర్ రెడ్డిని కాపాడి అక్కడి నుంచి దవాఖానకు తరలించారు. దీనిని బట్టి చూస్తే బీఆరెస్ కార్యకర్తలు, నాయకులు విమర్శలను తట్టుకునే స్థితిలో కూడా లేరని అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల అచ్చంపేటలో ఎమ్మల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. గువ్వల బాలరాజుకు గాయం కావడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. దీనిని ఒక డ్రామాగా కాంగ్రెస్ కొట్టి పారేసింది. గువ్వల బాలరాజు కావాలనే రెచ్చగొట్టి దాడులు చేశాడని కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం దుబ్బాక బీఆరెస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతిగా బీఆరెస్ కార్యకర్తలు స్థానిక బీజేపీ కార్యాలయంపై దాడులుచేశారు. ప్రభాకర్‌రెడ్డి పై దాడి బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ రంగు పులుముకుంది.
అలాగే నామినేషన్ల సందర్భంగా చెన్నూరులో బీఆరెస్ ఎమ్మల్యే బాల్కసుమన్, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వర్గీయుల మధ్య దాడులు జరిగాయి. ఇదే తీరుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నామినేషన్ల సందర్భంగా బీఆరెస్ ఎమ్మల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి వర్గీయుల మధ్య దాడులు జరిగాయి. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. పటాన్ చెరులో నీలం మధు, కాటాశ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. నల్లగొండలో బీఆరెస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణలు జరిగాయి.
ప్రజాస్వామ్యానికి చేటు
ఏ పార్టీ అభ్యర్థి అయినా ఆ పార్టీ విధానాలు, ప్రత్యర్థి పార్టీ లోపాలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో పాటు గెలిచిన తరువాత ప్రజలకు ఏమి చేస్తారో చెప్పుకుంటే సరిపోతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కానీ దీనికి భిన్నంగా సహనం కోల్పోయి ఘర్షణలకు దిగుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు చెబుతున్నారు.
ఇలాంటి ఘర్షణల ద్వారా టెర్రరైజ్ చేసి లబ్ది పొందాలని చూస్తున్నట్లుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో గెలుపు ముఖ్యమేకానీ, గెలుపు కంటే కూడా ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడడం చాలా ముఖ్యమని సీనియర్ పాత్రికేయుడు ఒకరు అన్నారు.
హద్దు దాటుతున్న విమర్శలు
నేతలు హద్దులు దాటిచేసుకుంటున్న విమర్శలు కూడా దాడులను ప్రోత్సహించేలా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం లిఫ్ట్ కట్టడానికి కుర్చీ దొరకలేదా? అని ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పుకోలేక దాడులు చేయాలా? అని అంటున్నారు.
ఇలాంటి దాడుల వల్ల ఆయా రాజకీయ పార్టీలు పరోక్షంగా హింసను ప్రోత్సహిస్తున్నట్లుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 రోజులు మాత్రమే గడువు మాత్రమే ఉందని, నేతలు సహనం పాటించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీలపైనే ఉంటుందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.