తెలంగాణలో కారు జీరో.. 17స్థానాల్లో రెండింటిలోనే బీఆరెస్ రెండో స్థానం.. భారీగా పుంజుకున్న బీజేపీ
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ దారుణ పరాజయాలను చవిచూస్తుంది. 2019ఎన్నికల్లో 9స్థానాలున్న బీఆరెస్ ఈ దఫా ఏకంగా సున్నాకు పడిపోవడం అత్యంత విషాదకర ఓటమి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఢీలా పడిన బీఆరెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఎదురవుతున్న ఫలితాలు చావుదెబ్బ వంటివంటున్నారు విశ్లేషకులు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ దారుణ పరాజయాలను చవిచూస్తుంది. 2019ఎన్నికల్లో 9స్థానాలున్న బీఆరెస్ ఈ దఫా ఏకంగా సున్నాకు పడిపోవడం అత్యంత విషాదకర ఓటమి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఢీలా పడిన బీఆరెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఎదురవుతున్న ఫలితాలు చావుదెబ్బ వంటివంటున్నారు విశ్లేషకులు. 17లోక్‌సభ స్థానాల్లో 16స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8స్థానాలు, ఎంఐఎం 1 స్థానంలో గెలుపు దిశగా సాగుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం, మహబూబబాద్, పెద్దపల్లి, జహిరాబాద్, నాగర్ కర్నూల్, భువనగిరి, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. వీటిలో బీఆరెస్ పార్టీ ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో ఉంది. మిగతా ఆరు సీట్లలో బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఈ పరిణామం లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్ నుంచి ఓటర్లు బీజేపీ వైపు మళ్లీనట్లుగా స్పష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక బీజేపీ గెలుపు బాటలో ఉన్న అదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌లలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, బీఆరెస్ ఆయా స్థానాల్లో మూడో స్థానంలో ఉండటం ఆ పార్టీకి తీవ్ర నిరాశను కల్గించేదిగా మారింది. అంటే ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల మధ్యనే నువ్వా నేనా అన్న పోటీ సాగినట్లుగా వెల్లడవుతుంది. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం చేతిలో ఓడిపోతున్న బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉంటే, కాంగ్రెస్ మూడో స్థానంలో, బీఆరెస్ నాల్గవ స్థానంలో నిలిచింది. మొత్తంగా బీఆరెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో భారీగా ఓట్లను కోల్పోతుండగా, అందుకు విరుద్ధంగా బీజేపీ తమ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది.