సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ, పాలన నిర్ణయాలు బూమ్ రాంగ్ అవుతున్నాయన్న గుసగుసలు పొలిటికల్ సర్కిల్ లో క్రమంగా బలపడుతున్నాయి. ఇందుకు తాజాగా హైదరాబాద్ మైత్రీవనం వద్ద మహానటుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను రేవంత్ రెడ్డి స్వయంగా నిర్వహించడం ఓ ఉదాహారణగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో వరుసగా దివంగత మాజీ సీఎం రోశయ్య, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ జరుగడాన్ని తెలంగాణ వాదులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వ్యాఖ్యలపై ఆంధ్ర నాయకత్వం వైఖరి కూడా తెలంగాణ వాదులలో ఆగ్రహాన్ని రగిలించింది. తాజా పరిణామాలన్నింటిని కలిపి విశ్లేషిస్తూ..రేవంత్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో మళ్లీ సమైక్య వాదుల, ఆంధ్రా పాలకుల ఆధిపత్య ధోరణులు పెచ్చరిల్లుతున్నాయన్న వాదన తెరపైకి వచ్చింది. ఇది ఓ విధంగా అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇరకాటంగా మారుతుంది. తెలుగువారందరికి ఎన్టీఆర్ పట్ల అభిమానం ఉన్నప్పటికి రాష్ట్ర విభజన తర్వాత కూడా కొత్తగా ఆంధ్రా ప్రాంత ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు ఎందుకన్న ప్రశ్నను తెలంగాణ వాదులు సంధిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతంలో గద్దర్ వంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టనివ్వనప్పుడు.. ఇక్కడా వాళ్ల విగ్రహాలు ఎందుకు అన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు. తెలంగాణ వాదుల అగ్రహాన్ని ఇదే అదనుగా బీఆర్ఎస్ రాజకీయంగా అడ్వాంటేజీగా మార్చుకునే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ కు మరింత సంకటంగా చెప్పవచ్చు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హామీల ముసుగు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్బంగా కాంగ్రెస్ హామీల అమలులో భాగంగానే తను ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగైతే అదే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఇంకా అనేక హామీలు ఇచ్చారు. సినీ కార్మికులకు ఇచ్చిన హామీలతో పాటు, కాలనీల వారిగా స్థానిక సమస్యలపై సైతం హామీలు గుప్పించారు. 2023అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలు, 420హామీలు, 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ భారీ సంఖ్యలో హామీలు గుప్పించారు. ఆయా ఎన్నికల హామీలకు లేని తొందర..అతృత ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు, అదికూడా ప్రభుత్వ డబ్బుతో ఎందుకన్న ప్రశ్న సహజంగానే వినిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాకుతో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకే దిక్కులేక..వచ్చే ఎన్నికల్లో గత హామీలే పార్టీ మెడకు గుది బండలుగా మారే పరిస్థితి కనిపిస్తున్న వేళ…అకస్మికంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై సీఎం రేవంత్ ఎందుకింత హడావుడి చేశారన్నది సొంత కాంగ్రెస్ శ్రేణులలో సైతం అయోమయం రేపింది.
సెటిలర్ల ఓట్ల కోసమేనా..?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి నెత్తినేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రేవంత్ చర్యతో పార్టీకి లాభం ఎంతన్నదానిపై పార్టీ వర్గాలలో జోరుగా అంతర్మథనం సాగుతుంది. ఓ వైపు ధాన్యం కొనుగోలు, రైతు భరోసా సమస్యలతో రైతులు, మరోవైపు జాబ్ క్యాలెండర్ అమలు కాక నిరుద్యోగులు, డిమాండ్లపై సానుకూల స్పందన లేక ఉద్యోగులు అసంతృప్తితో రగిలిపోతున్న తరుణంలో ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ రచ్చ ఎందుకన్న వాదన సైతం వినిపిస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో 2009ఎన్నికల్లో బీఆర్ఎస్, టీడీపీ కూటమిని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఆ తర్వాత 2018ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కూటమిని సైతం తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ప్రజాతీర్పు సమైక్యవాదానికి వ్యతిరేకంగా స్పష్టంగా ఉన్నప్పటికి కూడా…మళ్లీ రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆంధ్ర నాయకత్వానికి ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారని?..రేవంత్ తీరు కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టాన్ని కల్లించవచ్చన్న చర్చ సాగుతుంది.
తెరపైకి అందెశ్రీ సమాధి పరిస్థితి
సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడాన్ని నిరసిస్తున్న తెలంగాణ వాదులు శనివారం ఉదయం తెలంగాణ కవి, గాయకుడు అందెశ్రీ సమాధి దుస్థితిపై వీడియో విడుదల చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పక్క రాష్ట్రం ప్రముఖుల విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రముఖులు విగ్రహాలు, సమాధులపై ఎందుకు లేదంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడైన అందెశ్రీ గతంలో రేవంత్ రెడ్డి సీఎం అవడానికి చాలా కష్టపడ్డారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అందెశ్రీ “స్మృతి వనం” అభివృద్దిని రేవంత్ విస్మరించినట్లుగా ఉందని, అక్కడ కనీసం ఆయన సమాధి కూడా సరిగా కట్టలేదంటూ రేవంత్ తీరుపై విమర్శలు సంధిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, దళితుడు, జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీని..ఎన్నికల సమయంలో వాడుకొని, ఆయన పాటను రాజకీయ అవసరాల కోసం వాడుకొని ఈరోజు ఆయన సమాధిని అనాధలా వదిలేశాడంటూ రేవంత్ రెడ్డిపై తెలంగాణ వాదులు విమర్శలు చేస్తున్నారు.
సురవరం విగ్రహావిష్కరణకు హాజరుకాకపోవడంపై ఫైర్
జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. అదే రోజు జరిగిన తెలంగాణ వైతాళికుడు సూరవరం ప్రతాప్‌రెడ్డి విగ్రహానికి పిలిచినప్పటికి ఎందుకు వెళ్లలేదంటూ పలువురు తెలంగాణ వాదులు నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెటిలర్ల ఓట్ల మీద ఉన్న ధ్యాస..తెలంగాణ వైతాళికుడి మీద లేదా అంటూ మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది ఆయన మీద ప్రేమతోనా? ఓట్ల కోసమా అంటూ నిలదీస్తున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న చర్చ బలంగా వినిపిస్తుండటం విశేషం.
అనాధలా అందెశ్రీ సమాధి!
తెలంగాణ ఉద్యమకారుడు, దళితుడు, జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ సమాధి వద్ద దుస్థితి
ఎన్నికల సమయంలో అందెశ్రీని వాడుకొని, ఆయన పాటను రాజకీయ అవసరాల కోసం వాడుకొని ఈరోజు ఆయన సమాధిని అనాధలా వదిలేసిన రేవంత్ రెడ్డి https://t.co/gXkISn2oqu pic.twitter.com/F49215JhQp
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2026
