మాజీ మంత్రి టి.హరీష్ రావు : నీళ్ల కోసం మరోసారి తెలంగాణ ఉద్యమం

బనకచర్లపై మరోసారి ఉద్యమం వస్తుందని హరీష్ రావు హెచ్చరిక. తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకంగా రెవంత్, బాబు వ్యవహరిస్తున్నారని ఆరోపణ.

మాజీ మంత్రి టి.హరీష్ రావు : నీళ్ల కోసం మరోసారి తెలంగాణ ఉద్యమం

బనచర్లను వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు
బాబు, రేవంత్ రెడ్డిలు తెలంగాణ ద్రోహులు
కాంగ్రెస్ పాలనలో నీళ్లు ఆంధ్రకు..నిధులు ఢిల్లీకి

విధాత, హైదరాబాద్ : గోదావరి నీళ్లు లెక్క..వాటా తేలకుండా రాత్రికి రాత్రి ఏపీ బనకచర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణ ఊరుకోదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బనకచర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నా తెలంగాణ సమాజం ఒప్పుకోదని.. నీళ్ల కోసం మరోసారి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందని.. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు మళ్లీ ఉద్యమ వేదికలై తెలంగాణ హక్కులు కాపాడతాయని హెచ్చరించారు. ఉప్పల్‌లో జరుగుతున్న బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొన్న హరీష్ రావు కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్ట్ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ తన చేతిలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అనుకుంటున్నాడని..బనకచర్ల ప్రాజెక్టు కోసం రేవంత్ రెడ్డి సంతకాలు పెడితే కేసీఆర్ ఊరుకోడు.. రైతులు ఊరుకోరని అన్నారు. సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని, రైల్ రోకోలు చేస్తామని.. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం తప్పా.. తెలంగాణ వాటాలో చుక్క నీటిని వదలుకోమని స్పష్టం చేశారు.

మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పిన చంద్రబాబు చరిత్ర మనం మరిచిపోలేదన్నారు. ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి. జై ఢిల్లీ, జై సోనియా, జై మోదీ అంటాడు కాని జై తెలంగాణ అనడన్నారు. కేసీఆర్‌ను తలుచుకోకుండా రేవంత్ ప్రసంగం ఉండదన్నారు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయింది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాత్రమేనని..ప్రజలు తిరగబడితే జిరాక్స్ కాపీ స్పీకర్‌కు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన రైఫిల్ రెడ్డి రేవంత్ ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడన్నారు.

కాంగ్రెస్ పాలనలో నీళ్లు ఆంధ్రకు..నిధులు ఢిల్లీకి

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పుస్తకాల్లో కేసీఆర్ పేరు తొలగించాడని.. తెలంగాణ తల్లి విగ్రహం మార్చాడని.. బతుకమ్మ తొలగించాడని. అంబేద్కర్ విగ్రహానికి ఏనాడు దండ వేయలేదని..తెలంగాణ పోరాటం, ఉద్యమం చరిత్రను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే బాబు పేరు మొదలు, రెండోది రేవంత్ రెడ్డిదేనన్నారు. సింహాలు చరిత్ర చెప్పనంత కాలం, వేటగాడు చెప్పిందే కథ అన్నట్లు ఉంటదని..కేసీఆర్ పోరాటం, ఉద్యమం చరిత్రగా చెప్పాలని.. లేదంటే అస్థిత్వంపై దెబ్బపడుతుందని..అందరం ప్రజలకు వివరించాల్సి ఉందన్నారు. ప్రపంచంలో ఏ పోరాటం అయినా యువతతోనే ప్రారంభమవుతుందన్నారు. 1969 ఉద్యమం, మలిదశ ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటంలో యువత పాత్ర కీలకం అన్నారు.

రాజకీయాల్లో ఎంతోమంది యువతను కేసీఆర్ తెచ్చారన్నారు. యువత నుండే నాయకత్వం పుడుతుందని..కేసీఆర్ విజనరీ నాయకుడన్నారు. రాజకీయ కక్షసాధింపు నాకు వద్దు, తెలంగాణ ప్రగతి నాకు కావాలని చెప్పిన నాయకుడు, పనిచేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. నీళ్ళు, నిధులు, నియామకాలు ఉద్యమ ట్యాగ్‌లైన్ అని..గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించింది కేసీఆర్ అని గుర్తు చేశారు. 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించింది కేసీఆర్ అని, కాంగ్రెస్ పాలనలో నీళ్ళు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి, ఢిల్లీకి పోతున్నాయని..బాబుకు నీళ్ళు, రాహుల్ గాంధీకి నిధులు వెళ్తున్నాయని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయన్నారు. నీటి దోపిడీ కుట్రలను బద్దలుకొట్టాలన్నారు.