G. Jagadeesh Reddy| గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం : మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి

ఎన్నికల్లో గ్యారంటీ కార్డుల హామీల పేరుతో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని..అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నాం అని బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి తెలిపారు.

G. Jagadeesh Reddy| గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం : మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి

విధాత: ఎన్నికల్లో గ్యారంటీ కార్డుల(congress guarantee card) హామీల పేరుతో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు(fulfill promises) చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని..అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు(Congress dues cards) పంచుతున్నాం అని బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి(G. Jagadeesh Reddy) స్పష్టం చేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల అమలు జాడ లేదన్నారు. గ్యారెంటీ కార్డులను దగ్గర పెట్టుకొని రాకుంటే మాకు గుర్తు చేయమని ఆనాడే కాంగ్రెస్ నాయకులు చెప్పారని..గ్యారెంటీ కార్డులు ఇచ్చి 22 నెలలు పూర్తయిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ కార్డుల ప్రకారమే ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో తెలిసేలా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు రూపంలో మేం గుర్తు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతు రుణమాఫీ డిసెంబర్ 9 లోపే చేస్తామని చెప్పి చేయలేదన్నారు. రూ.50వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి.. రూ. 20 వేల కోట్లు చేశామని చెప్పుకున్నారని..అందులో కూడా రూ. 17000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని విమర్శించారు.

ఒక్కొక్కరికి కాంగ్రెస్ బాకీలు వేలల్లోనే..

రైతుబంధు కాదు రైతు భరోసా అని చెప్పి..ఒక్కో ఎకరానికి రూ. 19 వేల బాకీ పడిందని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. మహిళలకు 2500 రూపాయలు మొదటి నెల నుంచే ప్రారంభిస్తామని చెప్పి.. ఒక్కో మహిళకు 55 వేల రూపాయలు కాంగ్రెస్ బాకీ పడిందని తెలిపారు. మొత్తం ఆసరా పెన్షన్‌లు ప్రతి ఒక్కరికి 44 వేల రూపాయలు బాకీ ఉందన్నారు. ఒక ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామని చెప్పిన వాళ్లకు కలిపితే రూ. 88 వేలు బాకీ ఉన్నట్టేనన్నారు. వికలాంగులకు కూడా ఒక్కొక్కరికి 44 వేల రూపాయలు బాకీ ఉందన్నారు. ఆటో కార్మికులకు ఏడాదికి 12 వేలు అని చెప్పిన ప్రకారం రూ. 22,000 బాకీ ఉందన్నారు. 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 5000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కూడా ఏడాదికి రూ. 12,000 అని చెప్పారు వాళ్లకు కూడా రూ. 24,000 బాకీ ఉందని తెలిపారు. ఇచ్చిన ఒక్క గ్రూపు1 లో కూడా మొత్తం ఫైరవీలు చేసి కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి వాళ్ళను కూడా మోసం చేశారని..విద్యార్థులకు 5 లక్షల భద్రత కార్డులు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారని విమర్శించారు. ఈ హామీలన్నీ కూడా సీఎం రేవంత్ మాత్రమే కాదు.. సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలు చెప్పినవేనన్నారు.

ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డులతో నిలదీయాలి

ప్రభుత్వ ఉద్యోగులనే కాదు ఔట్ సోర్సింగ్ ఉద్యోగలను కూడా దారుణంగా మోసం చేశారని..ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. సినిమాకు పోయి తొక్కేసలాటలో చనిపోతే ఎంతో పెద్ద హడావిడి చేసిన ప్రభుత్వం..యూరియాలో ఉన్న నిలబడి మహిళా రైతు చనిపోతే పరామర్శించిన పాపాన పోలేదని తప్పుబట్టారు. రైతుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వస్తారో చూద్దాం అన్నారు. ఎన్నికలని ఇండ్ల ముందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డులు చూపించి నిలదీయాలని కోరారు.

త్వరలో చలో ఆల్మట్టి ఆందోళన

ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాసినట్లు అవుతుందని…అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున నల్గొండ రైతులతో కలిసి రెండు మూడు రోజుల్లో చలో ఆల్మట్టి కార్యక్రమాన్ని చేపడతున్నాం అని జగదీష్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంతసేపు కమిషన్లు, పంపకాలు తప్పితే తెలంగాణ రైతాంగ సమస్యల గురించి అవగాహన లేదన్నారు. తెలంగాణ నీటి హక్కులు సాధించాలన్న సోయి లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ఉన్నాడని..ఆయనకు సోయి లేదు.. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైతే నీళ్ల గురించి ఎలాంటి అవగాహన లేదని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి ఓ డమ్మీమంత్రి అని విమర్శించారు. పైన ఉన్నది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వమే, కింద ఉన్నది రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ప్రభుత్వమేనని..ఇక్కడున్న రేవంత్ రెడ్డి తన గురువుకు దక్షిణగా తెలంగాణ నీటి హక్కులను కట్టబెడుతున్నాడని…దీన్ని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో చలో ఆల్మట్టి కార్యక్రమం చేపట్టి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుంటాం అన్నారు.