ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి : కేరళం సీఎం పినరయి స్ట్రాంగ్ కౌంటర్

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రభుత్వంపై విమర్శలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేరళం సీఎం పినరయి విజయన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశారు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఓటుకు నోటు దొంగ.. సీఎం రేవంత్ రెడ్డి గురించి నేనేమి మాట్లాడుతానంటూ గట్టిగానే చురకలేశారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేరళం సీఎం పినరయి విజయన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశారు.  సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఓటుకు నోటు దొంగ.. సీఎం రేవంత్ రెడ్డి గురించి నేనేమి మాట్లాడుతానంటూ గట్టిగానే చురకలేశారు. అతను ఓటు చోరీ చేశాడని మీ అందరికి తెలుసు అని, కేరళం ప్రజలు దొంగల మాటలు ఎప్పుడు విశ్వసించబోరన్నారు. అది కేరళం యొక్క అదృష్టం అని, రేవంత్ ఎలాంటివాడో తెలంగాణ మొత్తానికి తెలుసు అన్నారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపే వ్యక్తి సోషల్ ప్రోగ్రెస్ (సామాజిక పురోగతి) గురించి నీతులు చెప్పేందుకు ప్రయ్నత్నించడం విడ్డూరంగా ఉంది అంటూ విజయన్ ఎక్స్ వేదికగా కూడా అంతకుముందు ఘాటుగా విమర్శించారు. కేరళం రాష్ట్రం దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి, అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రమని ఆయన గుర్తు చేశారు. అక్షరాస్యతలో తామే దేశంలో ముందున్నామని, తమ పాలనను వేలెత్తి చూపించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు.

ప్రగతి గణంకాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు

నీతి ఆయోగ్ ఎస్డీజీ సూచిక (2023-24)లో కేరళం 79 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ 6వ స్థానంలో ఉందని, మీ తెలంగాణ రాష్ట్రంలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కేరళంను ఎగతాళి చేయడం అత్యంత విచారకరం అని పినరయి విజయన్ తప్పు బట్టారు. నీతి ఆయోగ్ ప్రకారం… కేరళంలో పేదరికం రేటు కేవలం 0.55%.. ఇది భారతదేశంలోనే అత్యల్పం. 2025 చివరి నాటికి దేశంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళం నిలవనుందని తెలిపారు. మరోవైపు, తెలంగాణలో పేదరికం రేటు 5.88% గా ఉంది. కేరళ 95.3% అక్షరాస్యత రేటుతో అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ ఇప్పటికీ 76.9%తో వెనుకబడి ఉందని విజయన్ గుర్తు చేశారు.

కాంగ్రెస్‌కు పరోక్షంగా సహాయపడటానికి కేరళలో రాజకీయ ప్రకటనలపై కోట్లు ఖర్చు పెట్టే బదులుగా.. రేవంత్ రెడ్డి తన సొంత రాష్ట్రం తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించడం, అక్షరాస్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి కదా అని హితవు పలికారు. కేరళ శిశు మరణాల రేటు (IMR) 5శాతానికి తగ్గింది. అమెరికాలోని 5.6 కన్నా కూడా ఇది మెరుగైనదని, తెలంగాణలో IMR శాతం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించారు. కేరళం పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా…. ఒక మలయాళీ సగటు భారతీయుడి కంటే 5-7 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తున్నాడని తెలిపారు. 2025 సెప్టెంబర్ 16న తెలంగాణ నుంచి రెవెన్యూ, సర్వే అధికారుల ఉన్నత స్థాయి బృందం కేరళం యొక్క ప్రతిష్టాత్మక డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థను అధ్యయనం చేయడానికి తిరువనంతపురాన్ని సందర్శించిందని.. కానీ కేరళం పాలన నమూనాని రేవంత్ రెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని విజయన్ ఎద్దేవా చేశారు.

మా అభివృద్ధిని చూసి నేర్చుకోండి

కేరళం, కేంద్ర ప్రభుత్వాల మధ్య అనైతిక అవగాహన ఉందన్న రేవంత్ రెడ్డి వాదన హాస్యాస్పదమైందని విజయన్ విమర్శించారు. కేరళం అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ఆర్థిక విధానాలకు… రుణ పరిమితుల కోతలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా, బీజేపీకి అసలైన బి-టీమ్‌గా వ్యవహరిస్తున్నది వెన్నుముక లేని కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. “సొంత రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వలేని రేవంత్ రెడ్డి.. మా దగ్గరకు వచ్చి పాలన, సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని, నిజానికి మీరే మా దగ్గరకు వచ్చి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో నేర్చుకోవాలి అని విజయన్ ఎద్దేవా చేశారు. ఖజానా ఖాళీ చేసి, సంక్షేమ పెన్షన్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న యూడీఎఫ్ శకం గతం అని, పరిపాలన, ప్రజా సంక్షేమంతో కూడిన నిజమైన పాఠాలు నేర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి కేరళ తరపున మేము స్వాగతంపలుకుతున్నాం అంటూ విజయన్ చురకలేశారు.

మోదీ, విజయన్ ఒక్కరేనంటూ రేవంత్ విమర్శలు

కేరళం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ విజయం కోసం ప్రచారానికి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సీఎం పినరయి విజయన్ సారధ్యంలోని కమ్యూనిస్టు పార్టీల కూటమి ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న పినరయి విజయన్ కు… తెలంగాణను పదేండ్ల పాటు పాలించిన కేసీఆర్ మధ్య అనేక పోలికలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అవినీతి, అసమర్థ, కుటుంబ పాలన విషయంలో వారిద్దరూ ఒక్కటేనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పోల్చి ‘మోదీ బ్రదర్స్’ అని సంబోధించారు. ఢిల్లీలో మోదీ, కేరళంలో విజయన్‌ ‘డబుల్‌ ఫెయిల్యూర్‌’గా నిలిచారని విమర్శించారు. పినరయి విజయన్ పాలనను ‘చీకటి యుగం’ అని విమర్శించారు. కేరళలో జాతీయ రహదారులు సహా పలు అభివృద్థి పనులు నిలిచిపోయినా సీఎం పినరయి విజయన్‌ ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. కేరళ ప్రజలు బీజేపీ, ఎల్డీఎఫ్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, సీపీఎంల మధ్య రహస్య అవగాహన ఉందని, అందుకే సీపీఎం వాళ్లపై ఎటువంటి కేసులూ ఉండవని ఆరోపించారు. దేశంలోని ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐలతో వేధించే బీజేపీ ప్రభుత్వం.. విజయన్‌ సర్కారుపై మాత్రం ఈగ వాలనీయట్లేదన్నారు. బీజేపీ, ఎల్‌డీఎఫ్‌ బయటకు పోటీ పడుతున్నట్టు కనిపించినా, అది ఉత్తుత్తి పోటీనేనంటూ విమర్శలు చేశారు.

Latest News