మోదీ.. విత్ కండిషన్స్ అప్లయ్!
పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క! నిరంకుశత్వాన్ని సహించేది లేదని భారతీయ ఓటరు శక్తినంతా కూడదీసుకుని చెప్పేందుకు ప్రయత్నించాడు! ఎన్డీయేకు నాలుగు వందలకు పైగానే అని రంకెలు వేసినా.. బీజేపీకి 370 దాటుతాయని ఘోషించినా.. ఓటరు మాత్రం నో చెప్పాడు!

సొంతగా మెజారిటీ సాధించని బీజేపీ
మూడో విడుతలో భాగస్వాములే ఆధారం
245 దగ్గర బీజేపీ.. 295 దగ్గర ఎన్డీయే
భారీగా బలం పుంజుకున్న ఇండియా కూటమి
రెట్టింపు సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ
కింగ్‌మేకర్లుగా నితీశ్‌కుమార్, చంద్రబాబు!
28 సీట్లలో గెలిచిన జేడీయూ, టీడీపీ
ఎన్డీయే నుంచి బయటకు వస్తే సీన్ రివర్స్
ఇద్దరినీ సంప్రదిస్తున్న ఇండియా పక్ష నేతలు
ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై నేడు చెబుతాం
మీడియా సమావేశంలో రాహుల్ కీలక వ్యాఖ్య
పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క! నిరంకుశత్వాన్ని సహించేది లేదని భారతీయ ఓటరు శక్తినంతా కూడదీసుకుని చెప్పేందుకు ప్రయత్నించాడు! ఎన్డీయేకు నాలుగు వందలకు పైగానే అని రంకెలు వేసినా.. బీజేపీకి 370 దాటుతాయని ఘోషించినా.. ఓటరు మాత్రం నో చెప్పాడు! పదేళ్లు అధికారం మదంతో విర్రవీగిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి కడు దూరంగా నిలిపాడు. ఏకఛత్రాధిపత్యాలు చెల్లబోవని, నలుగురితో కలిసి అధికారం పంచుకుంటూ అదుపులో ఉండాల్సిందేనని సందేశం పంపాడు. ఎన్డీయే పక్షాలతో కలిసి మాత్రమే.. వాటి దయాదాక్షిణ్యాలపై, అవి పెట్టే షరతులకు లోబడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితికి నెట్టడం ద్వారా.. పెను గుణపాఠం చెప్పాడు. అందుకే.. మళ్లీ బీజేపీ సర్కార్ వచ్చినా.. షరతులు వర్తిస్తాయి!
కడపటి సమాచారం అందేసరికి ఎన్డీయే కూటమి 291, ఇండియా కూటమి 234, ఇతరులు 18 స్థానాల్లో విజయం లేదా ఆధిక్యంతో ఉన్నారు. బీజేపీ 240 సీట్లలో విజయం లేదా ఆధిక్యంతో ఉన్నది. కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసుకుని విజయం లేదా ఆధిక్యంతో 99 స్థానాల్లో నిలిచింది. ఇండియా కూటమిలో ఇతర కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్న సమాజ్‌వాది పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, శివసేన (ఉద్ధవ్) 9, ఎన్సీపీ (శరద్) 7, వామపక్షాలు 5 సీట్లలో విజయం లేదా ఆధిక్యంలో ఉన్నాయి.
కింగ్‌మేకర్లుగా చంద్రబాబు, నితీశ్‌కుమార్
ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ ఏపీలో 16 సీట్లు, జేడీయూ బీహార్‌లో 12 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కింగ్‌మేకర్లుగా అవతరించనున్నారు. ఎన్డీయేలో బీజేపీ తర్వాత అధిక సీట్లు గెలిచింది ఈ రెండు పార్టీలే. దీంతో ఇప్పుడు వీరి నిర్ణయం ఎలా ఉండబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ ఎన్డీయేలోనే కొనసాగి, మోదీ సర్కారుకు మద్దతు ఇచ్చినా.. ప్రభుత్వ మనుగడ అనేది వీరిద్దరి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో అన్నాడీఎంకే మద్దతుపై ఆధారపడిన బీజేపీ ప్రభుత్వం.. జయలలిత మద్దతు ఉపసంహరణతో చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చంద్రబాబుకు ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది. నితీశ్‌కుమార్ తిరిగి రావడంపైనా తమకేమీ అభ్యంతరాలు లేవని ఇండియా కూటమి నేతల నుంచి వినిపిస్తున్నది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని శరద్‌పవార్ చెప్పగా.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ వైఖరిని బుధవారం ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ చెప్పడం ఈ అంశాన్ని రసవత్తరంగా మార్చింది.