పోచారం శ్రీనివాస్ రెడ్డి : ప్రజల కోసమే పార్టీ మారాను
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌కు మారినట్లు స్పష్టం చేసిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... ఇది ప్రజల అభివృద్ధి కోసమేనని తెలిపారు. బాన్సువాడ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని, రైతులకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

విధాత: ప్రజల కోసమే తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని..బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడం లక్ష్యంగా పనిచేస్తున్నానని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై నేను మాట్లాడబోనన్నారు. నా నియోజకవర్గం బాన్సువాడ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో బాన్సువాడ మొదటి స్థానంలో ఉందన్నారు. ఐటీఏ, ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణం జరుపుకుంటున్నాయన్నారు. ప్రజల అవసరాల కోసం మిగిలిపోయిన అన్ని పనులు పూర్తి చేస్తానన్నారు. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించువెలుతున్నామని..అది స్థానిక ప్రజలకు తెలుసని పోచారం చెప్పారు.
రైతుల సంక్షేమానికి ఏకకాలంలో 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సన్న బియ్యంకు బోనస్, రైతు భరోసా అందిస్తున్నారని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు, విద్యుత్తు సరఫరా వంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం పనిచేస్తుందని…సాగునీటి సరఫరా సవ్యంగా సాగుతుందని తెలిపారు.