గాంధీ భవన్ తాకిన తుంగతుర్తి కాంగ్రెస్ వర్గ పోరు సెగలు

తుంగతుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రరూపం దాల్చింది. ఎమ్మెల్యే మందుల సామేల్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ అనంతరం కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుల నియామకాలే వివాదానికి కారణమయ్యాయి.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుకూల, వ్యతిరేక వర్గాలు నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో బాహాబాహికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కాంగ్రెస్‌ పార్టీలోని ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకొన్నారు. వారిని అదుపు చేసుందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఘర్షణలో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులు సైతం గాయపడ్డారు. ఎమ్మెల్యే సామేల్ వ్యతిరేక వర్గీయులు ఛలో గాంధీభవన్‌ కార్యక్రమం చేపట్టి వెళ్తుండగా ఘర్షణ జరిగింది. గాంధీభవన్ కు వెలుతున్న కార్యకర్తలను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది.

ఘర్షణ అనంతరం కూడా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు హైదరాబాద్ గాంధీభవన్ కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే మందుల సామేల్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఒంటెద్దు, నియంతృత్వ పోకడలతో పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే సామేల్ పై చర్యలు తీసుకోవాలంటూ పీసీసీ నేతలకు ఫిర్యాదు చేశారు.

మండల అధ్యక్షుల నియామకంతో రాజుకున్న చిచ్చు

నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం రెండు వర్గాల మధ్య విభేదాలకు కారణమైందని సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే సామెల్ తన వర్గీయులను మండల కాంగ్రెస్ అధ్యక్షులను నియమించుకుని, ఒరిజినల్ కాంగ్రెస్ వారికి అన్యాయం చేస్తున్నారంటూ వ్యతిరేక వర్గీయులు ఆరోపిస్తున్నారు. మండల అధ్యక్షుల నియామకాలను తక్షణమే రద్దు చేయాలంటూ సామేల వ్యతిరేక వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, దివంగత మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి సామేల్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం వినిపిస్తుంది. మండల అధ్యక్షుల నియామకాలను ఏకాభిప్రాయం వచ్చే వరకు నిలిపివేయాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు లేఖ రాయడం వివాదాన్ని మరింత రచ్చకెక్కించింది.

Latest News