Consanguineous Marriage : మేనరికం పెళ్లిళ్లతో సమస్యలు నిజమేనా?
మేనరికం పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థలాసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి వ్యాధుల అవకాశాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు.
విధాత : ఒకప్పుడు దేశంలో ఎక్కువగా జరిగే..మేనరికం పెళ్లిళ్లు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఆధునిక నాగరీత తెచ్చిన మార్పుల క్రమంలో చదువు, ఉద్యోగాల సమయంలో ఎదురైన పరిచయాలు..ప్రేమలు..కెరీర్ పరంగా తగిన జీవిత భాగస్వామి ఎంపికలు వంటి అంశాలతో పాటు జన్యుపరమైన సమస్యల నేపథ్యంలో మేనరికం పెళ్లిళ్లు చాలవరకు తగ్గిపోయాయి. అయితే మేనరికం పెళ్లిళ్లతో సంతాన పరంగా జన్యుపరమైన సమస్యలు ఎదురవుతాయన్న అంశాలను ఇప్పటికే శాస్త్రవేత్తలు తమ పరిశోధనలలో తేల్చేశారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ సమయంలో మేనరికం పెళ్లిళ్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అసలు మేనరికం పెళ్లిళ్లతో ఎలాంటి సమస్యలు వస్తాయన్న అంశం ఆసక్తి రేపుతుంది.
జన్యు సమస్యల క్రమం
మేనరికంతో ఒక్కటయ్యే జంటలకు సంబంధించి పిల్లల ఆరోగ్య పరంగా కొన్ని లోపభూయిష్టమైన (ఫాల్టీ) జన్యువులు ఎక్కువగా కలిసి జన్యుపరమైన జబ్బులు కలుగజేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దగ్గరి బంధువులను వివాహం చేసుకోవడం వల్ల తల్లిదండ్రుల నుండి ఒకే విధమైన లోపభూయిష్ట జన్యువులు బిడ్డకు సంక్రమించి, ఆరోగ్య సమస్యలు, అంగవైకల్యం లేదా మానసిక లోపాలతో కూడిన పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుందని సైన్స్ వెల్లడిస్తుంది. దీన్ని కాన్‌శాన్‌గ్వినిటీ అని పిలుస్తారు. కాన్‌శాన్‌గ్వినిటీ అంటే రక్తసంబంధం, దగ్గర బంధువులను వివాహం చేసుకోవడం. ఈ తరహా పెళ్ళిళ్లు భారత్ లో సుమారు 13.6శాతం జరుగుతున్నాయి.
మేనరికం పెళ్లిళ్లతో పుట్టే పిల్లలకు ఇతరులతో పోల్చితే జన్యుపరమైన సమస్యలు 3శాతం ఎక్కువని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మేనరికం పెళ్లిళ్ల కారణంగా గర్భస్రావాలు, గర్బస్థ శిశు మరణాలు, నవజాత శిశువు మరణాలు కూడా ఎక్కువేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టే పిల్లలకు గుండె సంబంధిత అవకారాలు, బుద్ధిమాంద్యం, మెదడు,రక్త సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు సాధారణ వివాహాల కంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు నిర్ధారించారు.థలాసీమియాతో పాటు సిస్టిక్ ఫైబ్రోసిస్(ఊపిరి తిత్తుల జబ్బులు) సమస్యలు కూడా వస్తాయిని గుర్తించారు.
అందరికి కాదు..కాని అవకాశాలు ఎక్కువ
మేనరికం చేసుకున్న ప్రతి జంట సంతానానికి సమస్యలు రాకపోయినా.. జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం మాత్రం ఎక్కువ అని సైంటిఫిక్ పరిధోకులు హెచ్చరిస్తున్నారు. ఒక బిడ్డ జన్మించాలంటే తల్లి నుంచి సగం జన్యువులు, తండ్రి నుంచి సగం జన్యువులు అవసరం. అవి కలిసి ఆరోగ్యకరమైన పిండాన్ని జనించేలా చేస్తాయి. అయితే తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరి జన్యువుల్లో లోపం ఉంటే, లోపం లేని మరొకరి జన్యువు…లోపం ఉన్న జన్యువును తొక్కి పెట్టి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడంలో సహకరిస్తుంది. అదే తల్లిదండ్రులిద్దరి జన్యు మూలాలు ఒక వ్యక్తి నుంచే వచ్చినవే అయితే, ఇద్దరి జన్యువుల్లోనూ లోపాలు ఉంటాయి. మేనరికపు వివాహాల్లో ఇద్దరి జన్యువుల మూలాలు ఒక వ్యక్తి నుంచి వచ్చినవే ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే వారికి పుట్టే పిల్లల్లో ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది.
నిమ్స్ కు వచ్చే జన్యు లోపాల కేసుల్లో చాలావరకు మేనరిక వివాహాలే ఉంటున్నాయని గతంలో వైద్యులు వెల్లడించారు. కొన్నిసార్లు శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడే జన్యు వ్యాధులు దాడి చేస్తాయని తెలిపారు. కొందరికైతే బిడ్డ పుట్టిన కొన్ని నెలల తర్వాత ఈ లోపాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. 2014లో 2,453 మంది చిన్నారులు జన్యులోపాలతో నిమ్స్ చేరారని, ఇప్పుడు 2026కు వచ్చే సరికి ఆ సంఖ్య 12వేలకు పెరిగిపోయిందని పేర్కొన్నారు.
రక్త సంబంధం ఎంత దగ్గరైతే జన్యు సమస్యలు అంత అధికం
అయితే ఒక కుటుంబం/ ఒక ఊర్లో/ ఒక గుంపులో ఏదో ఒకసారి రెండుసార్లు కాకుండా తరాల కొద్దీ మేనరిక వివాహాలు జరుగుతూ ఉంటే వాళ్ళలో పిల్లల్లో జన్మతహ లోపాలు, జన్యు సమస్యలు ఉండే అవకాశం బాగా ఎక్కువని చెబుతున్నారు. దీనినే ఎండోగామీ గా పేర్కొంటున్నారు. అందుకే మేనరికం వివాహాలు అంత శ్రేయస్కరం కాదంటున్నారు.
ఈ విశ్లేషణలు చూస్తే..మేనరికం వలన పుట్టే పిల్లల్లో అందరిలో జన్యుపరమైన సమస్యలు రావు. రక్త సంబంధం ఎంత దగ్గరైతే అంత ఎక్కువ రిస్కు అని మాత్రమే స్పష్టం అవుతుంది. మామ- మేనకోడలు > బావ- మరదలు (అన్న చెల్లెలి పిల్లలు) > బావ- మరదలు (అన్న చెల్లెలి/ అన్న తమ్ముడు/ అక్క చెల్లి మనవళ్లు) > అమ్మాయి- అబ్బాయి ( రక్త సంబంధం లేని వాళ్ళు)లకు జన్మించే సంతానంలో జన్యుపరమైన సమస్యల అవకాశాలు ఎక్కువని నిపుణులు వెల్లడిస్తున్నారు.
జన్యు సమస్యలను ముందే గుర్తించవచ్చు
ఇప్పుడు వచ్చిన ఆధునిక గర్భస్త్ర శిశు పరీక్షలు (రక్తం, స్కానింగ్) ద్వారా జన్యు లోపాలని ముందే పసిగట్టవచ్చు. దాని ద్వారా చికిత్స చేయించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నార్వే వంటి దేశాల్లో మేనరికాన్ని నిషేధించారు. పుట్టబోయే శిశువుల ఆరోగ్యం , కుటుంబంలో బలవంతపు పెళ్లిళ్ల నిరోధానికి ఆ దేశంలో మేనరికపు పెళ్లిళ్లను నిషేధించారు. ఈ విశ్లేషణల సమాచారం నేపథ్యంలో మేనరికపు వివాహం చేసుకోలనుకునే వారు.. ముందుగా మెడికల్ జెనిటిసిస్ట్ ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Sleep | సరైన నిద్ర లేకుంటే గుండెకు నష్టమే..! తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!
Cervical Cancer | ప్రతి 8 నిమిషాలకు ఓ మహిళను బలితీసుకుంటోన్న సర్వైకల్ క్యాన్సర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram