శ్రీలంకXIతో జరుగుతున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఎదురీదుతుంది. బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీ (103) సహాయంతో టీమిండియా టీ బ్రేక్ సమయానికి 50ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక XI ఓవర్‌నైట్ స్కోరు 363/8 వద్ద డిక్లేర్ చేసింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను లంక బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) డకౌట్ కాగా.. రిషభ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) కూడావిఫలమయ్యారు. మరో ఎండ్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (40) ఫర్వాలేదనిపించాడు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన దేవదత్ పడిక్కల్ శ్రీలంక స్పిన్నర్లను కాచుకుంటూ 121 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. అనంతరం రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్‌కి వెళ్లాడు. క్రీజ్‌లో రవీంద్ర జడేజా (29*), మానవ్ సుతార్ (3*) ఉన్నారు.
శ్రీలంకతో ఈ నెల 15వ తేదీ నుంచి జరగబోయే టెస్టులో ఫస్ట్ డౌన్‌లో ఆడాల్సిన సాయి సుదర్శన్ గాయపడిన సంగతి తెలిసిందే. శ్రీలంక XIతో జరిగిన మ్యాచ్ లో పడిక్కల్ సెంచరీతో రాణించడం ద్వారా.. సాయి సుదర్శన్ స్థానంలో ఆడేందుకు తానున్నానంటూ పడిక్కల్ సమాధానమిచ్చినట్లయ్యింది. మరోవైపు లంక తొలి ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్ శుభమన్ గిల్ బ్యాటింగ్ రాకపోవడంతో తొలి టెస్టుకు అతను అందుబాటులో ఉంటడా లేదా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి.
