INDW won World Cup | జయహో భారత్ : తొలిసారి ప్రపంచకప్ సాధించి చరిత్ర సృష్టించిన ఇండియా
నవి ముంబయిలో జరిగిన మహిళా వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి, తొలిసారిగా ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది.
India Crowned ICC Women’s World Cup 2025 Champions — Historic Maiden Title in Navi Mumbai
(విధాత స్పోర్ట్స్ డెస్క్)
మహిళా వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది భారత అభిమానుల కలల్ని నిజం చేస్తూ భారత్ తొలిసారిగా ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. నవి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఇది భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణక్షణంగా నిలిచిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రోటీస్ ముందుంచింది. అయితే తొలిసారి ఫైనల్ ఆడుతున్న సౌతాఫ్రికా జట్టు ఒత్తిడిని తట్టుకోలేక 246 పరుగులకు కుప్పకూలింది.
1973లో ప్రారంభమైన ప్రపంచకప్ పోటీల్లో ఎప్పుడూ విజేతలుగా నిలిచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు సెమీస్‌లోనే నిష్క్రమించగా, తొలిసారి ఫైనల్‌కు చేరిన సౌతాఫ్రికా, మూడోసారి ఫైనల్‌కు చేరిన ఇండియా మళ్లీ తలపడ్డాయి. లీగ్ దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయానికి ధీటైన బదులిచ్చి, ఫలితంగా కప్పునెత్తుకుంది.
తొలి ఫైనల్ ఒత్తిడిని తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా
299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు కెప్టెన్ లారా వోల్వార్డ్, బ్రిట్స్ దూకుడుగా ఆట ప్రారంభించారు. అయితే 51 పరుగుల వద్ద తొలివికెట్ రూపంలో బ్రిట్స్ రనౌటయింది. కాసేపటికే బాష్ శ్రీచరణికి వికెట్ల ముందు దొరికిపోయింది. తర్వాత వచ్చిన లూస్‌తో కలిసి వోల్వార్డ్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. 114 పరుగుల వద్ద లూస్ ఇన్నింగ్స్‌కు తెరపడగా, ఆ తర్వాత ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా, కెప్టెన్ లారా వోల్వార్డ్ మొక్కవోని ధైర్యంతో ఆడి సెంచరీ చేసి, దురదృష్టవశాత్తు 220 పరుగుల వద్ద 7వ వికెట్‌గా దీప్తి శర్మకు బలైంది. ఇక ఆ తర్వాత మిగతా 3 వికెట్లు 26 పరుగులే చేయగలిగాయి.
భారత బౌలర్లలో దీప్తి శర్మ చెలరేగిపోయి, దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను కుప్పకూల్చింది. ఏకంగా 5 వికెట్లు తీసుకుని భారత విజయంలో ముఖ్య భూమిక పోషించింది. తర్వాత షఫాలీ బంతితో కూడా రాణించి 2 వికెట్లు తీసింది.

చెలరేగిన షఫాలీ, దీప్తి
కాగా, టాస్ ఓడిపోయి, బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరచింది. నవి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, దీప్తి శర్మ 58 పరుగులు చేసి చివరవరకు నిలిచింది. స్మృతి మందాన 45 పరుగులు, రిచా ఘోష్ 34 పరుగులు చేసి జట్టుకు తోడయ్యారు.
వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం రెండు గంటలు ఆలస్యమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. షఫాలీ వర్మ, స్మృతి మందాన జోడీ మొదటి నుంచే ధాటిగా ఆడింది. మొదటి ఎనిమిది ఓవర్లలో 58 పరుగులు రాబట్టి సౌతాఫ్రికా బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. షఫాలీ చాలా ఆత్మవిశ్వాసంగా ఆడుతూ ఒక సిక్స్, తొమ్మిది ఫోర్లు బాదింది. మందాన నెమ్మదిగా ఆడి, స్ట్రైక్ రొటేట్ చేసే బాధ్యత తీసుకుంది. అయితే కొద్దిసేపటికే మందాన 45 పరుగుల వద్ద స్పిన్నర్ క్లోయ్ ట్రయన్ బౌలింగ్‌లో అవుట్ అయింది. దాంతో తొలి వికెట్ పడింది. ఆ తరువాత జెమిమా రోడ్రిగ్స్(24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20)మంచి ఆరంభం చేసినా, తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ షఫాలీ వర్మ(87) ఒక దశలో సెంచరీ చేస్తుందనిపించినా, అలసటతో కొంత నిదానమై, పెద్ద షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చింది. అయినా ఆమె ఇన్నింగ్స్ భారత జట్టుకు బలమైన పునాది వేసింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ(58) ఆ తరువాత చక్కగా ఆడింది. ఒక్కో బంతిని జాగ్రత్తగా ఆడి, సింగిల్స్ తీసుకుంటూ స్కోరు ముందుకు తీసుకెళ్లింది.
మ్యాచ్ చివర్లో రిచా ఘోష్ క్రీజులోకి వచ్చి ఆట వేగం మార్చింది. ఆమె వచ్చిన రెండో బంతినే సిక్స్ బాది అభిమానులను ఉత్సాహపరిచింది. మొత్తం 24 బంతుల్లో 34 పరుగులు చేసి, రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదింది. అయితే చివరి ఓవర్లలో అయబోంగా ఖాఖా వేసిన యార్కర్‌కు బలై అవుట్ అయింది. ఖాఖా ఈ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీసింది. షఫాలీ, జెమిమా, రిచా ఘోష్‌లను ఔట్ చేసి భారత్ దూకుడు తగ్గించింది.
భారత్ ఒక దశలో 300 పరుగులు దాటుతుందని అనిపించినా, చివరి పది ఓవర్లలో కేవలం 69 పరుగులే వచ్చాయి. బౌలర్లు యార్కర్లు, స్లో బంతులు వేస్తూ భారత్ వేగాన్ని తగ్గించారు. అయినా 298 పరుగులు ఫైనల్ స్థాయిలో మంచి స్కోరే.
డీవై పాటిల్ స్టేడియంలో ప్రేక్షకులు మ్యాచ్ మొత్తం హోరెత్తించారు. ప్రతి బౌండరీ, సిక్స్‌కి అభిమానులు నిలబడి చప్పట్లు కొట్టారు. షఫాలీ హాఫ్ సెంచరీ చేసినప్పుడు మొత్తం స్టేడియం లైట్లు వెలిగించి శుభాకాంక్షలు తెలిపింది.
సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు తీసుకోగా, ఎంలాబా, డిక్లెర్క్, ట్రయన్ తలా ఒక వికెట్ సాధించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram